ముంబై, జూన్ 1 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ నష్టపోయాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చమురు ధరలు భగ్గుమనడం మదుపర్లను అమ్మకాలవైపు నడిపించాయి. ఫలితంగా లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరికి నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 75 వేల పైకి చేరుకున్న 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 508.40 పాయింట్లు కోల్పోయి 74,267.34 వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 165.15 పాయింట్లు కోల్పోయి 23,382.60 వద్ద ముగిసింది. ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణుల దాడులను ముమ్మరం చేయడంతో గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 3.34 శాతం ఎగబాకి 94.16 డాలర్లకు పుంజుకోవడం దేశీయ ఈక్విటీలపై ప్రతికూల ప్రభావం చూపాయి.
ఇంధన ధరలు భగ్గుమనడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నదన్న అంచనా నెలకొనడం సూచీల పతనానికి ఆజ్యంపోసిందని జియోజిట్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 30 షేర్ల ఇండెక్స్ సూచీల్లో హెచ్‌యూఎల్, ఐటీసీ, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. కానీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు నష్టపోయాయి. రంగాలవారీగా పవర్ సూచీ అత్యధికంగా 2.90 శాతం కోల్పోగా..క్యాపిటల్ గూడ్స్ 2.44 శాతం, యుటిలిటీస్ 2.12 శాతం, ఇండస్ట్రియల్స్ 2.11 శాతం, రియల్టీ 2.03 శాతం, ఎఫ్ఎంసీజీ 2.02 శాతం చొప్పున పతనం చెందాయి. కానీ, ఐటీ, ఎనర్జీ, మెటల్ రంగ షేర్లుల లాభాల్లో ముగిశాయి. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 2,221.62 పాయింట్లు లేదా 2.90 శాతం నష్టపోగా, నిఫ్టీ 649.1 పాయింట్లు లేదా 2.70 శాతం కోల్పోయింది.