ముంబై, జూలై 3 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి. ఐటీ రంగ షేర్లకు లభించిన మద్దతుతోపాటు అమెరికా ఉద్యోగ గణాంకాలు నిరాశావాదంగా ఉండటంతో ఫెడరల్ రిజర్వు ద్రవ్య పరపతి సమీక్షలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోవడం సూచీలను లాభాల వైపు నడిపించాయి. ఇంట్రాడేలో 78 వేల పాయింట్ల పైకి చేరుకున్న 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ వారాంతపు ట్రేడింగ్ ముగిసే సరికి 77,763.91 వద్ద స్థిరపడింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 261.79 పాయింట్లు ఎగబాకింది. అలాగే మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 95.15 పాయింట్లు అందుకొని 24,270.85 వద్ద ముగిసింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు ఈ వారంలో లాభాల్లో ముగిశాయని, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు అమెరికా నిరుద్యోగ గణాంకాలు మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
భారత్-జపాన్ సమ్మిట్‌తోపాటు ఐటీ రంగ షేర్లు లాభాల్లో కదలాడటం కూడా కలిసొచ్చిందన్నారు. సూచీల్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీ 5.79 శాతం ఎగబాకి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు టెక్ మహీంద్రా 1.81 శాతం, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటాస్టీల్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో కదలాడాయి. కానీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టీ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా రియల్టీ 2.22 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, ఫోకస్డ్ ఐటీ 1.74 శాతం, ఐటీ 1.55 శాతం, హెల్త్‌కేర్ 1.31 శాతం, కమోడిటీస్, మెటల్, టెలికాం రంగ షేర్లు లాభపడగా..పవర్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, యుటిలిటీ, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లు నష్టపోయాయి.