ముంబై, అక్టోబర్ 20: ఇటీవలి మార్కెట్ ర్యాలీలో బాగా విలువ పెరిగిన షేర్లను ఇన్వెస్టర్లు విక్రయించడంతో స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. బీఎస్ఈ సెన్సెక్స్ బుధవారం 456 పాయింట్ల నష్టంతో 61,260 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 152 పాయింట్లు నష్టపోయి, 18,267 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టైటాన్ 3 శాతం క్షీణించింది. హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రాలు కూడా తగ్గాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్ 4 శాతం పెరిగింది. ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్‌లు సైతం లాభపడ్డాయి.
వరుసగా రెండురోజులు మార్కెట్ క్షీణతతో ఇన్వెస్టర్లు 6.6 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఈ బుధవారం ఒక్కరోజునే రూ.3.3 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.