న్యూఢిల్లీ, జూన్ 4: సోషల్ మీడియాపై తమ పేరు, లోగో, అధికారిక పత్రాల (లెటర్ హెడ్)తో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ బుధవారం హెచ్చరించింది. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ మదుపరులకు సూచించింది. కొందరు మోసగాళ్లు సెబీ ఉన్నతాధికారుల పేర్లనూ వాడుకుంటున్నట్టు చెప్పింది. కాబట్టి ఈ తరహా తప్పుడు సమాచారాన్ని ఎవరూ తమ మొబైల్స్, సోషల్ మీడియా వేదికల ద్వారా ఇతరులకు పంపించవద్దని కోరింది. మోసపూరిత సందేశాలకు భయపడి ఎవరికీ నగదును కూడా పంపించవద్దన్నది.
చర్యలు తీసుకోకుండా ఉండాలంటే జరిమానాలు చెల్లించాలని కొందరు మదుపరులకు సందేశాలు వస్తున్నాయని, ఈ క్రమంలో సెబీ పేరు, లోగో, లెటర్హెడ్లను వాడుతున్నారన్న ఫిర్యాదులు బాధితుల నుంచి అందుతున్నాయని మార్కెట్ రెగ్యులేటర్ తెలియజేసింది. దీంతో సెబీ పైవిధంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
సదరు తప్పుడు వార్తలను ధ్రువీకరించుకొనేందుకు సెబీ అధికారిక వెబ్సైట్ (www.sebi.gov.in)ను సందర్శించాలని కూడా ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చింది. అమాయక మదుపరులను మోసం చేసేందుకు ఇటీవలికాలంలో ఆర్బీఐ, సెబీ, ఈడీ ఇతర దర్యాప్తు సంస్థల పేర్లను అక్రమార్కులు అడ్డుపెట్టుకుంటున్నారు. దీంతో ఆయా రెగ్యులేటర్లు మదుపరుల రక్షణార్థం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.