Share Market | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. జమ్మూ, పఠాన్‌కోఠ్ ఎయిర్‌బేస్‌లపై దాడికి విఫల ప్రయత్నాలను భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో శుక్రవారం మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గత సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 78,968.34 వద్ద నష్టాల్లో మొదలైంది. సెన్సెక్స్ ప్రారంభంలోనే 400 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 800 పాయింట్ల నష్టంతో 79,533.84 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది. మరో వైపు నిఫ్టీ 260.8 పాయింట్లు తగ్గి 24,013 పాయింట్ల వద్ద కదలాడుతున్నది. మార్కెట్లో దాదాపు 555 షేర్లు లాభపడగా.. 2618 షేర్లు నష్టపోయాయి. మరో 109 షేర్లు మాత్రం మారలేదు.
నిఫ్టీలో టైటాన్, లార్సెన్, భారత్ ఎలక్ట్రికల్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, ఎస్బీఐ, ఏషియన్ పేయింట్స్, ఓఎన్జీసీ, విప్రో లాభపడ్డాయి. జియో ఫైనాన్షియల్, ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎటర్నల్, గ్రాసిమ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత లాభం (PAT) 25 శాతం పెరిగి రూ.5,497 కోట్లకు చేరుకున్నట్లు లార్సెన్ అండ్ టూబ్రో నివేదించిన తర్వాత 4 శాతానికిపైగా పెరిగింది. టైటాన్ కంపెనీ కూడా 4 శాతానికి పైగా పెరిగింది. మార్చి త్రైమాసికంలో టాటా గ్రూప్ సంస్థ ఏకీకృత లాభంలో 13 శాతం పెరిగినట్లు తెలిపింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) గురువారం రూ.2,007.96 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని ఎక్స్ఛేంజ్ డేటా తెలిపింది.