ముంబై, జూలై 25 : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో నష్టాలపాలయ్యాయి. దీంతో కేవలం రెండు రోజుల్లోనే మదుపరుల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్లు హరించుకుపోయింది. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 721.08 పాయింట్లు లేదా 0.88 శాతం పడిపోయి నెల రోజుల కనిష్ఠాన్ని తాకుతూ 81,463.09 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 786.48 పాయింట్లు దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 225.10 పాయింట్లు లేదా 0.90 శాతం కోల్పోయి నెల రోజుల కనిష్ఠ స్థాయిని సూచిస్తూ 24,837 వద్ద నిలిచింది. గురువారం సెన్సెక్స్ 542.47 పాయింట్లు, నిఫ్టీ 157.80 పాయింట్లు పడిపోయాయి.
సెల్లింగ్ ప్రెషర్‌తో.. మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేయడంతో ఆర్థిక, ఐటీ, చమురు-గ్యాస్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొన్నది. దీనికితోడు విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో మార్కెట్లు మరింతగా నష్టపోయాయని తాజా ట్రేడింగ్ సరళిని ఈక్విటీ విపణుల్లోని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రంగాలవారీగా.. యుటిలిటీస్, పవర్, చమురు-గ్యాస్, ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, మెటల్ రంగాల షేర్లు 2.37 శాతం నుంచి 1.64 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌లో నమోదైన సంస్థల్లో బజాజ్ ఫైనాన్స్ షేర్ విలువ గరిష్ఠంగా 4.73 శాతం పడిపోయింది. క్యూ1 ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపలేదు. పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, టాటా మోటర్స్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ షేర్ల విలువ కూడా పెద్ద ఎత్తునే దిగజారింది. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 1.88 శాతం, మిడ్‌క్యాప్ 1.46 శాతం చొప్పున క్షీణించాయి.
గత రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్లలో నమోదైన నష్టాలు.. లక్షల కోట్ల రూపాయల్లో మదుపరుల సంపదను ఆవిరి చేశాయి. వరుసగా గురు, శుక్రవారాల్లో సెన్సెక్స్ 1,263.55 పాయింట్లు, నిఫ్టీ 382.90 పాయింట్లు క్షీణించాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈ నమోదిత ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల మార్కెట్ విలువ రూ.8,67,406.75 కోట్లు హరించుకుపోయి రూ.4,51,67,858.16 కోట్ల (5.22 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) గడిచిన రెండు రోజుల్లో రూ.4,500 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం.
దేశంలో విదేశీ మారకం (ఫారెక్స్) నిల్వలు ఈ నెల 18తో ముగిసిన వారం రోజుల్లో మరో 1.183 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీంతో 695.489 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. అంతకుముందు వారం కూడా 3.064 బిలియన్ డాలర్లు పడిపోయాయి.