Stock Market | బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం ప్లాట్‌గా ముగిశాయి. ఉదయం మార్కెట్లు లాభాల్లో మొదలైనా.. ఆ తర్వాత ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్ లాభపడడంతో నష్టాల నుంచి కాస్త గట్టెక్కాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ ఉదయం 82,527.43 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. పొద్దంతా పెరుగుతూ.. తగ్గుతూ వచ్చాయి. ఇంట్రాడేలో 82,538.17 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్.. కనిష్టంగా 82,110.63 పాయింట్లకు పడిపోయింది. చివరకు 13.53 పాయింట్లు తగ్గి 82,186.81 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం 29.80 పాయింట్లు క్షీణించి 25,060.90 వద్ద స్థిరపడింది. అయితే, ఆగస్టు ఒకటి గడువుకు ముందు అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం విషయంలో స్పష్టత లేకపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. సెన్సెక్స్ కంపెనీలలో ఎటర్నల్ ర్యాలీ కొనసాగింది. క్యూ-1 లాభాల నేపథ్యంలో షేర్లు 10.56శాతం పెరిగాయి. జొమాటో, బ్లింకిట్ బ్రాండ్లను కలిగి ఉన్న ఫుడ్ డెలివరీ ఫాస్ట్-కామర్స్ కంపెనీ ఎటర్నల్ సోమవారం జూన్ త్రైమాసికంలో రూ. 25 కోట్ల లాభాలను నివేదించింది. నిఫ్టీలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా తగ్గింది.
నిఫ్టీలో ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్ కంపెనీ, హిందాల్కో ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ లాభపడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ నష్టపోయాయి. మీడియా ఇండెక్స్ 2.5 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.6 శాతం, రియాల్టీ ఇండెక్స్ 1 శాతం, ఆటో ఇండెక్స్ 0.6 శాతం, ఫార్మా ఇండెక్స్ 0.9 శాతం క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ఇక గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 0.97 శాతం తగ్గి 68.54కి చేరుకుంది. సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) రూ.1,681.23 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIs) రూ.3,578.43 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.