Muhurat Trading | భారత స్టాక్ మార్కెట్ ప్రత్యేకంగా మూరత్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించింది. దీపావళి పండుగ సందర్భంగా మంగళవారం మూరత్ ట్రేడింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కొత్త హిందూ క్యాలెండర్ సంవత్సరం, విక్రమ్ సంవత్ ప్రారంభాన్ని సూచిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరం స్వాగతం పలుకుతూ ఈ మూరత్ ట్రేడింగ్ నిర్వహించే విషయం తెలిసిందే. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఎంసీఎక్స్, ఎన్సీడీఈఎక్స్ మూరత్ ట్రేడింగ్ మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రారంభమై 1.45 గంటలకు ముగిసింది. ఆ తర్వాత రియలిస్టెడ్ సెక్యూరిటీల ప్రీ ఓపెన్ సెషన్ 1.30 గంటల నుంచి 1.45 వరకు సాగింది.
ఆ తర్వాత సాధారణ మూరత్ ట్రేడింగ్ సెషన్ 1.45 గంటలకు ప్రారంభమై.. 2.45 గంటలకు పూర్తయ్యింది. ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 62.97 పాయింట్లు పెరిగి 84.426.34 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25.45 పాయింట్లు పెరిగి 25,868.60 వద్ద ముగిసింది. దాదాపు 2,720 షేర్లు లాభపడ్డాయి. 902 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్ లాభపడ్డాయి. అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మాక్స్ హెల్త్‌కేర్, ఆసియన్ పెయింట్స్ నష్టపోయాయి. మెటల్, మీడియా, టెలికాం ఒక్కొక్కటి 0.3శాతం పెరగ్గా.. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం వృద్ధిని నమోదు చేసింది.