Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం ట్రేడింగ్ లో ప్రారంభ లాభాలు హరించుకుపోయాయి. కార్పొరేట్ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ సుమారు మూడు శాతం పుంజుకున్నా సూచీలు నష్టాలతోనే స్థిర పడ్డాయి.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 959 పాయింట్ల పతనంతో కనిష్ట స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 73.48 పాయింట్ల నష్టంతో 81,151.27 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 73 పాయింట్లు కోల్పోయి 24,781 పాయింట్ల వద్ద ముగిసింది.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఏషియన్ పెయింట్స్, ఎంవై అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ సంస్థలు 0.4 నుంచి 2.6 శాతం వరకూ లబ్ధితో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్ల విక్రయాలు నష్టాలు మిగిల్చాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1.6 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీలో మీడియా ఇండెక్స్ 2.8 శాతం నష్టపోగా, రియాల్టీ 1.7 శాతం, ఐటీ 1.5 శాతం, ప్రైవేట్ బ్యాంకు 1.3 శాతం నష్టంతో ముగిశాయి.