Mark Zuckerberg | మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) నికర వ్యక్తిగత సంపద 200 బిలియన్ డాలర్లు దాటింది. తద్వారా గ్లోబల్ బిలియనీర్ల జాబితాలో ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకూ ఈ జాబితాలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్, ఎల్వీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ అర్నాల్ట్ ఉన్నారని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది.
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కుబేరుడిగా ఎలన్ మస్క్ నిలిచారు. ఎలన్ మస్క్ వ్యక్తిగత నికర సంపద 265 బిలియన్లు, జెఫ్ బెజోస్ సంపద 216 బిలియన్ల డాలర్లు. మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కు కంపెనీలో వాటా 13 శాతం పెరగడం వల్లే ఆయన వ్యక్తిగత సంపద పెరిగింది. గత జూలై లో మెటా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం 2023 నుంచి కంపెనీ 134.9 బిలియన్ల డాలర్ల రెవెన్యూ పెంచుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా మెటాకు నెలవారీగా 400 కోట్ల యూజర్లు ఉన్నారు. మెటా కనెక్ట్ 2024 ఈవెంట్లో మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ మెటా ఏఐ సెక్సెస్ వల్లే ఆదాయం పెరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ అసిస్టెంట్ వాడకం విస్తృతంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం 500 మిలియన్ల నెలవారీ యూజర్లు పెరిగారని, యూరోపియన్ యూనియన్ వంటి ప్రధాన మార్కెట్లలో మెటా ఏఐ సేవలు ఇంకా ప్రారంభించలేదని చెప్పారు.