రాష్ట్రమంతటా అభివృద్ధి విస్తరిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో వాటర్ హీటర్ల తయారీ కేంద్రం మొదలైంది. దీంతో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించినైట్టెంది.
హైదరాబాద్, జనవరి 12: రాష్ట్రంలో మరో పరిశ్రమ కొలువుదీరింది. హింటాస్టికా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్పీఎల్).. వాటర్ హీటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటుచేసిన అత్యాధునిక ప్లాంట్ మొదలైంది. ప్రముఖ సంస్థ హింద్‌వేర్ హోం ఇన్నోవేషన్ లిమిటెడ్, ఐరోపాకు చెందిన గ్రూప్ అట్లాంటిక్ సంస్థల జాయింట్ వెంచరే హెచ్పీఎల్. ఈ ఉత్పాదక కేంద్రాన్ని హింద్‌వేర్ హోం ఇన్నోవేషన్ లిమిటెడ్ చైర్మన్ సందీప్ సోమనీ, గ్రూప్ అట్లాంటిక్ సీఈవో పియర్రీ లూయిస్ ఫ్రాన్కోయిస్, భారత్‌లో ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ట్రేడ్ కమిషనర్ ఎరిక్ ఫాజోల్ కలిసి ప్రారంభించినట్టు గురువారం హింటాస్టికా ప్రకటించింది. ప్రారంభోత్సవంలో ఇరు సంస్థల ఉద్యోగులు, వ్యూహాత్మక భాగస్వాములు, కస్టమర్లు కూడా పాల్గొన్నారు. కాగా, రూ.210 కోట్ల ఆరంభ పెట్టుబడులతో తెచ్చిన ఈ ప్లాంట్ ద్వారా 500 మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
సార్క్ దేశాలకు ఎగుమతులు
బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంకలకు ఈ ప్లాంట్ నుంచి వాటర్ హీటర్లు, ఇతర హీటింగ్ అప్లియెన్సెస్ ఎగుమతి చేయనున్నట్టు ఈ సందర్భంగా హెచ్పీఎల్ తెలియజేసింది. 5.7 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్లాంట్‌ను పర్యావరణ హితంగా తీసుకొచ్చారు. దీని వార్షిక ఉత్పాదక సామర్థ్యం 6 లక్షల వాటర్ హీటర్లు. అత్యాధునిక తయారీ యంత్రాలతో ఏర్పాటైన ఈ ప్లాంట్‌కు అత్యంత తక్కువ విద్యుత్ వినియోగమే అవుతుందని కూడా సంస్థ ఈ సందర్భంగా ప్రకటించింది. ఇదిలావుంటే ఇక్కడ స్కేర్ మౌల్డెడ్, ఎజ్రో నియో, అలివివో వంటి సిలిండ్రికల్ స్టోరేజ్ వాటర్ హీటర్ మాడల్స్ ఉత్పత్తి జరుగుతున్నది.
‘గ్రూప్ అట్లాంటిక్‌తో మేము ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్లో భాగంగా ఈ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. కరోనా నేపథ్యంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ ప్లాంట్ ఉత్పత్తిని ప్రారంభించడం ఆనందంగా ఉన్నది. దీంతో మార్కెట్లో, ముఖ్యంగా వాటర్ హీటర్ విపణిలో మా వాటా మరింత పెరుగుతుందని
ఆశిస్తున్నాం’
-సందీప్ సోమనీ, హింద్‌వేర్ హోం ఇన్నోవేషన్ లిమిటెడ్ చైర్మన్
‘హింద్వేర్తో మా ప్రయాణం పదేండ్లపైనే. నేడు ఈ ప్లాంట్‌తో మా బంధం మరో ముందడుగు వేసింది. భారత్ వంటి దేశాల్లో విజయం సాధించడానికి హింద్‌వేర్ తరహా సంస్థల స్నేహం అవసరం. భారత్‌లో వాటర్ హీటర్ల మార్కెట్ మున్ముందు మరింతగా విస్తరిస్తుంది. విద్యుత్ ఆదాతో మెరుగైన ఉపకరణాలు ఇప్పుడు అవసరం’
-పియర్రీ లూయిస్ ఫ్రాన్కోయిస్, గ్రూప్ అట్లాంటిక్ సీఈవో