జాల్నా, సెప్టెంబర్ 12: ఓబీసీ కోటా ద్వారా మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్న మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు, సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే మరోసారి ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్ల కోటా కల్పించాలన్న డిమాండ్‌తో ఈ నెల 19 నుంచి ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు శనివారం ప్రకటించారు. దీక్ష కోసం సెప్టెంబర్ 15 నుంచి ర్యాలీగా బయలుదేరుతామని చెప్పారు.
బీడ్‌లోని పటోడాలో15న, అహల్యానగర్ జిల్లాలోని శ్రీగొండలో 16న, పుణె జిల్లాలోని హడప్సర్లో 17న, రాయ్‌గఢ్ జిల్లా ఖోపోలిలో 18న బస చేస్తామని ఆయన వివరించారు. ప్రతి రోజు సుమారు 100 కి.మీ వరకు తమ ప్రదర్శన సాగుతుందన్నారు.19వ తేదీ ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభమువుతుందని చెప్పారు. మరాఠాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించే వరకు తమ దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గణపతి ఉత్సవాలు ఈ నెల 14-25 మధ్య మహారాష్ట్రలో ఘనంగా జరగనున్న క్రమంలో ఆయన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.