దేశం ఆర్థిక సంక్షోభం ముంగిట మోకరిల్లుతున్న రోజులవి.అత్యవసరాల దిగుమతులకు తప్ప సరిపడా లేని విదేశీ ద్రవ్య నిల్వలతో సతమతమవుతున్న గడ్డు పరిస్థితులు.
అప్పుడే స్వతంత్ర భారతావనికున్న ఆర్థిక సంకెళ్లను తన సంస్కరణలతో తెంచిన చాణక్యుడు మన్మోహన్ సింగ్. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించి దేశ ఆర్థిక రూపురేఖల్ని మార్చడంలో మరువలేని పాత్ర పోషించారు.
Manmohan Singh | న్యూఢిల్లీ, డిసెంబర్ 27: సమస్య పుట్టినప్పుడే.. దాన్ని పరిష్కరించే సామర్థ్యమున్నవాడూ పుడతాడు. అలా భారతావనిని చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలను తన సంస్కరణలతో తరిమికొట్టిన గొప్ప ఆర్థికవేత్తే మన్మోహన్ సింగ్. కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌గా రెండేండ్లకుపైగా పనిచేసిన మన్మోహన్.. ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు హయాంలో ఐదేండ్లపాటు ఆర్థిక మంత్రిగా బ్యాధ్యతల్ని నిర్వర్తించారు. ఆ తర్వాత కాలంలో తన అనుభవంతో దేశ ప్రధానిగా కూడా మెప్పించారు. మొత్తానికి స్వతంత్ర భారత ఆర్థిక, రాజకీయ రంగాలను 50 ఏండ్లకుపైగా మన్మోహన్ సింగ్ తనదైన ముద్రవేసి నడిపించారు.
ఇదీ సంగతి..
భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పునాదులు పీవీ-మన్మోహన్ హయాంలోనే పడ్డాయన్నది నిర్వివాదాంశం. జాతీయ, అంత ర్జాతీయ కారణాలతో సంక్షోభంలోకి జారుకుంటున్న దేశాన్ని.. తిరిగి గాడిలో పెట్టడానికి ఆర్థిక మంత్రిగా కీలక నిర్ణయాలను సింగ్ తీసుకోవాల్సి వచ్చింది. స్వపక్షం నుంచే అనేక విమర్శలొచ్చినా లెక్కచేయకుండా సాహసించారు. అలాంటి టాప్-10 సంస్కరణల్లో..
1991 బడ్జెట్
బలహీనపడ్డ దేశ ఆర్థిక వ్యవస్థను బలపర్చేందుకు మన్మోహన్ సింగ్ చేసిన తొలి ప్రయత్నం.. 1991లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్. అనేక సంస్కరణలను, పన్ను విధానాలను ప్రకటించి భారత భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు.
రూపాయి విలువలో మార్పులు
దేశంలో విదేశీ మారకం నిల్వలు అడుగంటిన వేళ రూపాయి విలువను 1991 జూలై 1, 3 తేదీల్లో వ్యూహాత్మకంగా 20 శాతం మేరకు తగ్గించారు. దీనివల్ల డాలర్, ఇతర దేశాల కరెన్సీలు, వీదేశీ ఆస్తులను రూపాయి విలువలోకి మార్చినప్పుడు అవి మరింత విలువైనవిగా మారాయి. ఇది దేశ ఆర్థిక సంక్షోభం ఇంకా ముదరకుండా అడ్డుకట్ట వేసింది. కరెంట్ అకౌంట్‌పై రూపాయిని పూర్తిస్థాయిలో కన్వర్ట్ చేసుకునే వెసులుబాటు లభించింది. రూపాయి విలువను తగ్గించిన నేపథ్యంలో విదేశాల్లో తాను పనిచేసినప్పుడు సంపాదించిన సొమ్ము విలువ అమాంతం పెరిగింది. అయినప్పటికీ అక్కడి బ్యాంకుల్లో ఉన్న ఆ నగదు మొత్తాన్ని భారత్‌కు తెచ్చి పీఎం జాతీయ సహాయ నిధికి విరాళంగా ఇచ్చి ఔదార్యాన్ని చాటుకున్నారు మన్మోహన్ సింగ్.
కొత్త పారిశ్రామిక విధానం
లైసెన్స్ రాజ్‌ను రద్దు చేశారు. అప్పటిదాకా ఉన్న చాలా ట్రేడ్ లైసెన్సులకు గుడ్‌బై చెప్తూ కొత్త పారిశ్రామిక విధాన తీర్మానం చేశారు. దీంతో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు స్వేచ్ఛా వాణిజ్యం చేరువైంది. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మార్గం సుగమమైంది. ప్రాధాన్య రంగాల పరిశ్రమల్లో విదేశీ ఈక్విటీని 40 శాతం నుంచి 51 శాతానికి పెంచారు.
ఎంఆర్టీపీ చట్టం సవరణ
గుత్తాధిపత్యం, నిర్బంధ వాణిజ్య పద్ధతుల చట్టంలో సవరణలు తెచ్చారు. దీంతో భారీ సంస్థలు తమ విస్తరణ కోసం ముందస్తు అనుమతుల అవసరం లేకుండా పోయింది.
బ్యాంకింగ్ రంగంలో..
కొత్తగా ప్రైవేట్ రంగ బ్యాంకులకు లైసెన్సులిచ్చారు. అలాగే వడ్డీరేట్ల నిర్ణయంలో బ్యాంకులపైనున్న నియంత్రణల్ని ఎత్తేశారు. బ్యాంకులను పబ్లిక్ లిస్టింగ్ చేశారు.
స్టాక్ మార్కెట్లలో..
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఏర్పాటైంది. పేపర్‌లెస్ ట్రేడింగ్ మొదలైంది. డిపాజిటరీలను అనుమతించారు. ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్‌ల్లోకి ప్రభుత్వ సంస్థల వాటాలు వెళ్లాయి.
విదేశీ సంస్థాగత మదుపరులు
భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు తొలిసారి విదేశీ సంస్థాగత మదుపరులు వచ్చింది మన్మోహన్ హయాంలోనే.
సెబీకి మరిన్ని అధికారాలు
క్యాపిటల్ మార్కెట్లను నియంత్రించేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి మరిన్ని అధికారాలు. స్టాక్ మార్కెట్ మోసాలకూ చాలావరకు అడ్డుకట్ట పడింది.
ఆర్థిక క్రమశిక్షణ
ఆర్థిక క్రమశిక్షణపైనా దృష్టి పెట్టారు. 1992-93కుగాను ద్రవ్యలోటును 5 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎంజీఎన్ఆర్ఈజీఏ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రధానిగా మన్మోహన్ సింగ్ తెచ్చారు. అలాగే సమాచార హక్కు చట్టాన్ని కూడా సింగ్ ప్రభుత్వమే తీసుకొచ్చింది.
దేశం ఆర్థిక పతనం అంచున ఉన్నది. కొద్ది వారాలపాటే అత్యవసర దిగుమతులను చేసుకోవడానికి విదేశీ మారకపు నిల్వలున్నాయి. అప్పుడే.. సరిగ్గా 1991 జూన్‌లో భారత ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్‌ను అప్పటి ప్రధాని పీవీ తీసుకొచ్చారు. పీవీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్ తెరతీశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటీకరణ, సరళీకరణపై దృష్టి పెట్టారు. విజయవంతమైన ఈ ప్రయత్నంలో మన్మోహన్‌కు బాసటగా నిలిచింది ఆయన బృందం. అందులో ఎవరెవరున్నారని పరిశీలిస్తే..
మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
వాణిజ్య కార్యదర్శిగా, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా, ఆర్థిక కార్యదర్శిగా పనిచేశారు. సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
ఎస్పీ శుక్లా
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో కీలక బాధ్యతల్ని నిర్వర్తించిన అనుభవం ఈయన సొంతం. సుంకాలు, వాణిజ్య విధానం రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. పలు వాణిజ్య సంస్కరణల్ని తెచ్చారు.
కేపీ గీతాకృష్ణన్
రెవిన్యూ కార్యదర్శిగా పనిచేశారు. నిబంధనలకు లోబడి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సాయాన్ని అందిపుచ్చుకోవడం, దేశ ఖజానాను మిగులు ద్రవ్య నిధుల దిశగా నడిపించడంలో ఈయనదే కీలక పాత్ర.
దీపక్ నయ్యర్
ప్రధాని పీవీకి ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. తద్వారా ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ నిర్ణయాలకు బలం చేకూర్చారు.
ఎస్ వెంకటరమణన్
ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేస్తూ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌కు ద్రవ్యపరమైన విధానాలతో మద్దతునిచ్చారు.
సీ రంగరాజన్
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, గవర్నర్‌గా పనిచేశారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ క్షీణతను తన సాధనాలతో అడ్డుకొన్నారు.
మన్మోహన్ సింగ్‌ను ఈ దేశం ఎప్పటికీ మరువదు. సంస్కరణలతో నవ భారత ఆర్థిక వ్యవస్థకు నాంది పలికారు. -ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్
1991లో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత్‌కున్న ఆర్థిక సమస్యల్ని తొలగించేలా చేసింది. -గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ
మన్మోహన్ సింగ్ ఓ గొప్ప ఆర్థికవేత్త. తన సంస్కరణలతో భారత ఆర్థిక రూపురేఖల్నే మార్చేశారు. -రఘురామ్ రాజన్, ఆర్బీఐ మాజీ గవర్నర్