న్యూఢిల్లీ, మే 31: ప్యాసింజర్ వాహనాల్లో 6 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరిగా ఉండాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ కోరుతున్నది. ఈ నిబంధనతో చిన్న కార్లకు దెబ్బని, ఇప్పటికీ ఇబ్బందుల్లో ఉన్న చిన్న కార్ల మార్కెట్ కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆటో రంగంలో ఉద్యోగాలూ పోవచ్చని హెచ్చరించింది. గడిచిన మూడేండ్లుగా ధరలపరంగా ప్రవేశస్థాయి విభాగంలో కార్ల అమ్మకాలు పడిపోయాయని గుర్తుచేసిన మారుతీ.. 6 ఎయిర్‌బ్యాగులను తప్పనిసరి చేస్తే కార్లను కొనాలని ఆశిస్తున్న ద్విచక్ర వాహనదారులకు బడ్జెట్ కష్టాలు రావచ్చన్నది.
8 మంది వరకు ప్రయాణించే అన్ని కార్లలో వాహన తయారీ సంస్థలు తప్పనిసరిగా 6 ఎయిర్‌బ్యాగులను అమర్చాల్సిందేనని ఈ ఏడాది ఆరంభంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. వాహనాల్లో ప్రయాణీకుల భద్రతా ప్రమాణాలను పెంచడంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్నది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ పీటీఐతో మాట్లాడుతూ.. 2020 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చిన బీఎస్6 నిబంధనసహా గత కొన్నేండ్లుగా అనేక రకాల నిబంధనలతో చిన్న కార్ల మార్కెట్ ప్రభావితమైందన్నారు. ఇప్పుడీ 6 ఎయిర్‌బ్యాగుల నిబంధనతో మార్కెట్ మరింత క్లిష్టతరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
పెరుగుతున్న ఇంధన ధరలు, భారంగా మారిన ఉత్పాదక వ్యయంతో ఇప్పటికే వాహనాల ధరలు పెరిగాయని ఆర్సీ భార్గవ ఈ సందర్భంగా అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా నాన్-మెట్రో మార్కెట్లలో చిన్న కార్ల అమ్మకాలు క్షీణించాయని చెప్పారు. 6 ఎయిర్‌బ్యాగులను తప్పనిసరి చేస్తే కార్ల ధరలు మరింత పెరగడం ఖాయమని, రూ.20,000ల నుంచి 25,000 వరకు రేట్లు పెరగవచ్చని అంచనా వేశారు. ఇదే జరిగితే విక్రయాలూ ప్రభావితం కాగలవని ఆందోళన వెలిబుచ్చారు. ఫలితంగా దేశీయ చిన్న కార్ల పరిశ్రమ వృద్ధికి ఉన్న అవకాశాలు ఇంకా సన్నగిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
దేశీయంగా ఉద్యోగ సృష్టిలో కార్లతయారీ రంగానిది కీలకపాత్రని ఈ సందర్భంగా భార్గవ స్పష్టం చేశారు. మార్కెట్లో కార్ల అమ్మకాలు పెరిగితే డ్రైవర్లు, మెయింటేనెన్స్, మెకానిక్‌లకు డిమాండ్ ఉంటుందని, ఆటోమొబైల్ వ్యాపారాలూ బాగుంటాయన్నారు. కరోనా నేపథ్యంలో గత మూడేండ్లుగా అమ్మకాలు, ఉత్పత్తి దిగజారి ఎందరో నిరుద్యోగులైన సంగతి విదితమే. ఇప్పుడు కొత్తగా ఉద్యోగావకాశాలూ వచ్చే వీలుండదని ఈ సీనియర్ ఆటో దిగ్గజం చెప్తున్నారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఈ 6 ఎయిర్‌బ్యాగుల తప్పనిసరి నిబంధనే లేదన్నారు. కాబట్టి ఈ విషయంలో మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం అమలుకు ఇది సరైన సమయం కూడా కాదని భార్గవ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్ద కార్ల కంటే చిన్న కార్లపైనే ఎక్కువ ప్రభావం పడుతుందని భార్గవ చెప్పారు. మెట్రో నగరాలు, దేశంలోని ప్రధాన నగరాల్లో లగ్జరీ కార్లు, ఖరీదైన కార్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయన్న ఆయన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే చిన్న కార్లను కొంటున్నారని తెలిపారు. ధరలు పెరిగితే సౌకర్యాలకు ప్రాధాన్యత ఇచ్చి కాస్త పెద్ద కార్ల కొనుగోళ్లకే అంతా మొగ్గు చూపుతారని వివరించారు. దీంతో చిన్న కార్ల తయారీనే తగ్గిపోవచ్చన్నారు. కాగా, హచ్‌బ్యాక్ సెగ్మెంట్లో 70 శాతానికిపైగా వాటా మారుతీ సుజుకీదే. ఆల్టో, ఎస్-ప్రెస్సో, సెలీరియో తదితర మోడల్స్ విక్రయాలు మార్కెట్లో భారీగా జరుగుతున్నాయిప్పుడు.