Luxury Brand | ముంబై, ఫిబ్రవరి 19: ప్రపంచంలోని టాప్-100 లగ్జరీ బ్రాండ్లలో భారత్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ, వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు 19వ స్థానం దక్కింది. దేశీయ లగ్జరీ గూడ్స్ మేకర్లలో అగ్రస్థానంలో ఉన్నది. గత ఏడాదికిగాను సోమవారం విడుదలైన డెలాయిట్ గ్లోబల్ లగ్జరీ గూడ్స్ తయారీదారుల జాబితాలో దేశంలోని 6 కంపెనీలకు చోటు లభించింది. వీటిలో మలబార్ గోల్డ్‌తోపాటు టైటాన్, కల్యాణ్ జ్యుయెల్లర్స్, జోయాలుక్కాస్, సెంకో గోల్డ్ అండ్ డైమం డ్స్, తంగమయిల్ జ్యుయెల్లరీ ఉన్నాయి. ఇందులో 5 నగల వ్యాపార సంస్థలే కావడం విశేషం. ఫ్యాషన్ యాక్ససరీ తయారీదారుగా టైటాన్ ఉన్నది. కాగా, టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌కు 24వ ర్యాంకు వచ్చింది. కల్యాణ్ జ్యుయెల్లర్స్కు 46వ స్థానం, జోయాలుక్కాస్‌కు 47వ స్థానం దక్కాయి. అలాగే 78వ స్థానంలో సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ ఉండగా, 98వ ర్యాం కులో తంగమయిల్ జ్యుయెల్లరీ నిలిచింది.
ఈ జాబితాలో మలబార్ గోల్డ్‌కు స్థానం దక్కడం ఇదే తొలిసారి. 2023లో ఈ కంపెనీ టర్నోవర్ 4 బిలియన్ డాలర్లకుపైగా ఉన్నది. డాలర్‌తో పోల్చితే ప్రస్తుత రూపాయి మారకం విలువ ప్రకారం ఇది దాదాపు రూ.34,000 కోట్లు. ఇక టైటాన్ టర్నోవర్ 3.67 బిలియన్ డాలర్లు. సుమారు రూ.30,000 కోట్లు. కాగా, భారత్‌లో లగ్జరీ గూడ్స్ మార్కెట్ క్రమేణా విస్తరిస్తూపోతున్నట్టు తాజా డెలాయిట్ రిపోర్టు తెలియజేసింది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ కంపెనీలు మున్ముందు మరింత ప్రభావం చూపగలవని అభిప్రాయపడింది.