న్యూఢిల్లీ, జనవరి 8: రవాణా సదుపాయాలు సమకూరుస్తున్న మేక్మైట్రిప్..కస్టమర్లను ఆకట్టుకోవడానికి వినూత్న ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ ప్రయాణికులను ఆకట్టుకోవడంలో భాగంగా తమ ముందస్తు విమాన టికెట్ బుకింగ్ చేసుకున్నవారు ఒకేసారి చెల్లింపులు జరుపాల్సిన అవసరం లేదని, విడతలవారీగా చెల్లిస్తే సరిపోతున్నదని వెల్లడించింది. ముందస్తు బుకింగ్ చేసుకున్న సమయంలో విమాన టికెట్ చార్జిలో 10 శాతం నుంచి 40 శాతం మధ్యలో చెల్లిస్తే సరిపోతున్నదని, మిగతాది ప్రయాణానికంటే ముందు లేదా బుకింగ్ చేసుకున్న నాటినుంచి 45 రోజులు ఏది ముందువస్తే ఆ రోజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.
ఈ ఆఫర్‌ను ఎంచుకున్నవారు ఎలాంటి అదనపు చెల్లింపులు జరుపాల్సిన అవసరం లేదని పేర్కొంది. విమానయాన రంగంలో ఇలాంటి ఫీచర్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని, ప్రయాణికులు తమ అంతర్జాతీయ రూట్లకోసం ఒకేసారి చెల్లింపులు జరుపాల్సి వస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వీరికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కీంను ప్రవేశపెట్టినట్లు మేక్మైట్రిప్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి సౌజన్య శ్రీవాత్సవ తెలిపారు.
ముఖ్యంగా అతిపెద్ద కుటుంబాలు లేదా గ్రూపులు తమ అంతర్జాతీయ బుకింగ్‌లపై ఒకేసారి మొత్తం చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ కొత్త స్కీంతో వీరికి ప్రయోజనాలు కలుగనున్నాయన్నారు. ఎక్కువ మంది భారతీయులను అంతర్జాతీయ విమానాల బుకింగ్ చేసుకునేందుకు వీలుగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ స్కీంనకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించిందని, ఒంటరిగా, జంటలు, కుటుంబాలు అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదన్నారు.