న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పాలసీదారుల్లో అత్యధికులు బీమా సంస్థలు మళ్లీ తమకు పాలసీ భౌతిక డాక్యుమెంట్లను అందజేయాలని కోరుకుంటున్నారు. కరోనా దృష్ట్యా ఇన్సూరెన్స్ కంపెనీలు.. పాలసీదారులకు డిజిటల్ ఫార్మాట్లోనే బీమా పత్రాలను పంపుతున్నాయి. ఈ క్రమంలో బాంబే మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ (బీఎంపీఏ) నిర్వహించిన ఓ సర్వేలో డిజిటల్ ఫార్మాట్తోపాటు భౌతిక రూపంలోనూ పాలసీ డాక్యుమెంట్లను పంపాలని మెజారిటీ పాలసీహోల్డర్స్ డిమాండ్ చేశారు. ఈ సర్వేలో దాదాపు 5వేల మంది పాల్గొనగా, ఇందులో సుమారు 88 శాతం పాలసీదారులు.. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ల ఫిజికల్ కాపీల పంపిణీ మొదలు కావాల్సిందే అన్నట్టు బీఎంపీఏ తెలిపింది.
క్లెయిముల్లో ఇబ్బంది
క్లెయిమ్ చేసినప్పుడు బీమా సంస్థలు భౌతిక డాక్యుమెంట్లనే అడుగుతున్నాయని ఈ సర్వే సందర్భంగా ఎక్కువమంది పాలసీదారులు చెప్పారు. ఇక కొన్ని బీమా సంస్థలు ఇన్సూరెన్స్ పాలసీల భౌతిక పత్రాలను పూర్తిగా తొలగించడం లేదా కోరుకుంటేనే ఇవ్వడం చేస్తున్నాయి. కరోనాకు ముందు నుంచీ ఇదే పద్ధతిలో వ్యాపారం చేస్తున్నాయి. అయితే ఈ సంస్థలే క్లెయిమ్ చేసినప్పుడు భౌతిక పత్రాలను అడుగుతున్నాయని గుర్తుచేశారు. ఇతర అవసరమైన పత్రాలనూ కోరుతున్నాయని అంటున్నారు. దీంతో కస్టమర్లు కోరుకుంటే పాలసీ భౌతిక పత్రాలను అందజేయాల్సిందేనని బీమా సంస్థలను బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఆదేశించాలని 80 శాతం మంది సూచించడం గమనార్హం.
నిబంధనలు ఏం చెప్తున్నాయి?
ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం పాలసీదారులకు భౌతికంగా, ఎలక్ట్రానిక్ రూపంలో బీమా పత్రాలను ఇన్సూరెన్స్ సంస్థలు అందివ్వాల్సి ఉంటుంది. అయితే కరోనా ఉద్ధృతి దృష్ట్యా పాలసీ కొనుగోలుదారులకు డిజిటల్ ఫార్మాట్లోనే ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను బీమా సంస్థలు అందజేయాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. కానీ ఈ ఆదేశాల గడువు గత నెలాఖరుతో తీరిపోయింది. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సర్వే మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నదిప్పుడు. కాగా, పాలసీ భౌతిక పత్రాలు ఇవ్వకుండానే క్లెయిముల్లో వాటిని కోరడం బాధితులను బీమా సంస్థలు మరింతగా ఇబ్బంది పెట్టడమేనని బీఎంపీఏ మేనేజింగ్ కమిటీ సభ్యుడు మెహుల్ దేశాయ్ అభిప్రాయపడ్డారు.