న్యూఢిల్లీ, డిసెంబర్ 4: విచ్చలవిడి రాజకీయాలతో సంస్కరణలు నెమ్మదిస్తాయని, విధానపరమైన నిర్ణయాలు ఉండబోవని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. వచ్చే ఏడాది భారత్‌సహా అనేక దేశాల్లో కీలక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిచ్ రేటింగ్స్ సోమవారం పైవిధంగా స్పందించింది. వివాదాస్పద రాజకీయాలు దీర్ఘకాలిక వృద్ధిరేటుకు గొడ్డలి పెట్టుగా మారుతాయని కూడా ఈ సందర్భంగా ఫిచ్ అభిప్రాయపడింది. స్వల్పకాలిక వృద్ధికే ప్రాధాన్యతల్ని పెంచుతాయన్నది. భారత్, బంగ్లాదేశ్, క్రొయేషియా, డొమికన్ రిపబ్లిక్, ఈఐ సాల్వెడార్, ఇండోనేషియా, కొరియా, మెక్సికో, పాకిస్తాన్, పనామా, రొమేనియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, తైవాన్, అమెరికాల్లో 2024లో పార్లమెంట్, అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. 2025 జనవరిలో బ్రిటన్‌లోనూ ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో తమ తాజా ‘గ్లోబల్ సావరిన్స్ ఔట్లుక్ 2024’ రిపోర్టులో రాజకీయ పార్టీల తీరు, గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటుచేసేవారి శైలిపట్ల ఫిచ్ స్పందించింది.
చమురు ధరలపై..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడుల వంటివి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను ఎగదోస్తాయని ఫిచ్ అన్నది. క్రూడాయిల్ రేట్లు పైపైకిపోతే ఆయిల్ ఎగుమతిదారులు, దిగుమతిదారులకు క్రెడిట్ సమస్యలూ ఏర్పడుతాయంటున్నది. మొత్తానికి చమురు ధరల్లో పెరుగుదల.. యావత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికే ఇబ్బందికరంగా మారుతుందని హెచ్చరించింది. ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీలో కీలకమైన భారత్.. దేశీయ చమురు అవసరాల కోసం విదేశాల నుంచి దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరెన్నో దేశాల పరిస్థితీ ఇంతే. ఈ క్రమంలోనే చమురు ధరల్లో పెరుగుదల.. ఆయా దేశాల్లో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, జీడీపీ క్షీణతలకు దారితీస్తుందని చెప్తున్నారు. ఇక ఈ ఏడాది ప్రపంచ వృద్ధిరేటు దాదాపు 3 శాతంగా ఉండొచ్చన్న ఫిచ్.. వచ్చే ఏడాది 2 శాతానికే పరిమితం కావచ్చన్నది. సావరిన్ క్రెడిట్‌కు వాస్తవిక వృద్ధిరేటు, వడ్డీరేట్లు రెండు స్థూల ఆర్థికాంశాలుగా పేర్కొన్నది.