న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా నడుస్తున్న మైనే ఫార్మా గ్రూప్‌నకు చెందిన అమెరికా జనరిక్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను డాక్టర్ రెడ్డీస్ అనుబంధ సంస్థ కొనుగోలు చేస్తున్నది. ఈ డీల్ విలువ సుమారు రూ.870 కోట్లు (105 మిలియన్ డాలర్లు). సలిస్బరి ఆధారిత మైనే ఫార్మాను సొంతం చేసుకోవడానికి డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఎస్ఏ ఓ ఒప్పందం చేసుకున్నది. ఈ మేరకు రెడ్డీస్ తెలియజేసింది. కాగా, ఈ లావాదేవీతో రెడ్డీస్ చేతికొచ్చిన పోర్ట్‌ఫోలియోలో 45 కమర్షియల్ ప్రొడక్ట్స్, 4 పైప్‌లైన్ ప్రొడక్ట్స్, 40 ఆమోదిత నాన్-మార్కెటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన జనరిక్ ఉత్పత్తులూ ఉన్నాయని డాక్టర్ రెడ్డీస్ సీఈవో రెజ్ ఇజ్రాయెలీ తెలిపారు. ఇది తమ అమెరికా రిటైల్ ప్రిస్క్రిప్షన్ ఫార్మాస్యూటికల్ బిజినెస్‌కు ఎంతగానో కలిసి రాగలదన్న ఆశాభావాన్ని కనబర్చారు.