న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా లైట్ కమర్షియల్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. 2-3.5 టన్నుల లోపు సామర్థ్యం కలిగిన ‘వీరో’ లైట్ కమర్షియల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలు రూ.7.99 లక్షల నుంచి రూ.9.56 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నాయి. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ ఆటోమోటివ్ డివిజన్ విజయ్ నక్రా మాట్లాడుతూ..దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఎల్సీవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయడానికి ఈ కొత్త వెర్షన్ మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇందుకోసం రూ.900 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు.
డీజిల్, సీఎన్జీ ఇంజిన్‌తో తయారైన ఈ వాహనాలతోపాటు భవిష్యత్తులో ఈవీని కూడా విడుదల చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. రెండు రకాల్లో లభించనున్న ఈ మాడల్ లీటర్ డీజిల్‌కు 18.4 కిలోమీటర్లు, కిలో సీఎన్జీకి 19.2 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ఈ ఎల్సీవీలో ఎయిర్‌బ్యాగ్ ఆప్షన్ కూడా ఉన్నదని, ఇందుకోసం రూ.15 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి.