SEBI Chairperson | దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)’ చైర్పర్సన్ నియామకానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం చర్యలు చేపట్టింది. ప్రస్తుత సెబీ చైర్పర్సన్ మాధాబీ పురి బుచ్ పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగియనున్నది. ఆమె పదవీ కాలానికి నెల రోజుల ముందే కేంద్రం కొత్త సెబీ చైర్పర్సన్ నియామకానికి అప్లికేషన్లను ఆహ్వానించడం గమనార్హం. మాధాబీ పురి బుచ్ పరస్పర ప్రయోజనాల (Conflict of Interest) వివాదంలో చిక్కుకున్నారు.
సెబీ చైర్పర్సన్ పదవి కోసం ఆసక్తి గల వారు వచ్చేనెల 17 లోగా దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ జారీ చేసిన వాణిజ్య ప్రకటనలో తెలిపింది. 50 ఏండ్ల పై బడిన వారు 25 ఏండ్ల వృత్తి నైపుణ్యం గల వారు ఈ పోస్టుకు అర్హులని పేర్కొంది. స్టాక్ మార్కెట్లలో తలెత్తే సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉండాలని వెల్లడించింది. న్యాయ, ఫైనాన్స్, ఆర్థిక, అకౌంటెన్సీలో ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉండాలని పేర్కొంది. సెబీ చైర్పర్సన్ పదవికి ఇబ్బంది కలిగించేలా ఆర్థిక, ఇతర ప్రయోజనాలు పొందుతూ ఉండ కూడదని కేంద్రం తెలిపింది.
ఈ పదవికి ఎంపికైన వారు ఐదేండ్లు లేదా వారికి 65 ఏండ్ల వయస్సు వచ్చే వరకూ కొనసాగుతారని వివరించింది. అయితే, 2022లో సెబీ చైర్‌పర్సన్‌గా నియమితులైన మాధాబీ బుచ్ పురి పదవీ కాలం మూడేండ్లకే ముగిసిపోతున్నది. అదానీ గ్రూప్‌తో ఆమెకు సంబంధం ఉందని యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ గతేడాది ఆరోపణలు గుప్పించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో సెబీ చైర్‌పర్సన్‌గా రాజీనామా చేయాలని మాధాబీ బుచ్ పురిని కాంగ్రెస్ పార్టీ పదేపదే డిమాండ్ చేసింది. ఇక ఆమె వ్యవహారశైలికి వ్యతిరేకంగా గతేడాది సెబీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.