HDFC Bank – LIC | దేశీయ స్టాక్ మార్కెట్లలో గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,04,477.25 కోట్లు పెరిగింది. వాటిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ఐసీ భారీగా లబ్ధి పొందాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 2,344.41 పాయింట్లు (3.47 శాతం) పుంజుకున్నది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 303.91 పాయింట్లు (0.44 శాతం) పుంజుకుని 69,825.60 పాయింట్ల వద్ద స్థిర పడింది. అంతర్గత ట్రేడింగ్లో 69,893.80 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. టాప్-10 సంస్థల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.74,076.15 కోట్లు పెరిగి రూ.12,54,664.74 కోట్ల వద్దకు చేరుకున్నది. ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ.65,558.6 కోట్లు లబ్ధితో రూ.4,89,428.32 కోట్లకు చేరుకున్నది. గురువారం అంతర్గత ట్రేడింగ్లో ఎల్ఐసీ షేర్ 52 వారాల గరిస్ట స్థాయిని తాకడంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్ల మార్కును దాటేసింది. కానీ ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.5 లక్షల కోట్ల మార్కుకు చేరువలో నిలిచిపోయింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.45,466.21 కోట్లు పెరిగి రూ.7,08,836.92 కోట్ల వద్ద స్థిర పడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.42,737.72 కోట్లు పెరిగి రూ.13,26,918.39 కోట్ల వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.42,454.66 కోట్లు పెరిగి రూ.16,61,787.10 కోట్ల వద్ద ముగిసింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.37,617.24 కోట్లు పెరిగి రూ.5,47,971.17 కోట్ల వద్ద నిలిచింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.15,916.92 కోట్లు పుంజుకుని రూ.6,18,663.93 కోట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,844.79 కోట్లు పతనమై రూ.5,92,414.19 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.8,569.98 కోట్ల నుంచి రూ.5,61,896.90 కోట్లకు పడిపోయింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.935.48 కోట్ల నష్టంతో రూ.5,60,223.61 కోట్ల వద్ద స్థిర పడింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్, ఎల్ఐసీ నిలిచాయి.