LTIMindtree | ముంబై, జూలై 17: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఎల్టీఐమైండ్ట్రీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,135 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 1.5 శాతం తగ్గినట్లు పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5 శాతం ఎగబాకి రూ.9,142.6 కోట్లకు చేరుకున్నది.
ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో దేబాషిస్ ఛటర్జీ మాట్లాడుతూ..గత త్రైమాసికంలో 1.4 బిలియన్ డాలర్ల విలువైన నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు, వరుస త్రైమాసికపు ఆదాయంతో పోలిస్తే 2.8 శాతం వృద్ధి నమోదైందన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగాల నుంచి వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. కొత్తగా 1,400 మంది ఫ్రెషర్లు చేరినప్పటికీ మొత్తం ఉద్యోగులు 82,738 నుంచి 81,934కి తగ్గారు.