
హైదరాబాద్, డిసెంబర్ 14: టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ కంపెనీ, మధ్య శ్రేణి ఐటీ సేవల సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో ఇన్ఫోటెక్ (ఎల్టీఐ).. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించింది. హైటెక్ సిటీలో కొత్త డెలివరీ సెంటర్‌ను ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ మంగళవారం ప్రారంభించింది. కంపెనీ అంతర్జాతీయ కార్యకలాపాలకు మద్దతుగా ఇక్కడి నుంచి 3వేలకుపైగా ఉద్యోగులు పనిచేయనున్నారు.
డిజిటల్, డాటా, క్లౌడ్‌పై దృష్టి
1,10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ సెంటర్‌ను ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఏర్పాటు చేసింది. విదేశీ కస్టమర్లకు డిజిటల్, డాటా, క్లౌడ్ సొల్యూషన్స్ అందించడంపై ఈ సెంటర్ ప్రధానంగా దృష్టి పెట్టనున్నది. సేఫ్టీ, సెక్యూరిటికి సంబంధించి కొత్త తరం సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నది. అలాగే మొత్తం ఉద్యోగుల శ్రేయస్సుకూ పెద్దపీట వేయనున్నది. ‘గ్లోబల్ టెక్నాలజీలో హైదరాబాద్ నగరం ఎంతో ప్రత్యేకం. ఇక్కడ నైపుణ్యానికి కొదవే లేదు. ప్రతిభావంతులు పుష్కలంగా లభిస్తారు. ప్రభుత్వం కూడా కార్పొరేట్ సంస్థలను ఎంతగానో ప్రోత్సహిస్తుంది. తగినన్ని సదుపాయాలు, సౌకర్యాలు కల్పించి మద్దతు ఇస్తుంది. ఈ కొత్త సెంటర్‌తో మా కార్యకలాపాలు మరింతగా బలోపేతమవుతాయి. మా వృద్ధిలోనూ ప్రధానంగా నిలవగలదు’ అని ఎల్టీఐ సీవోవో నచికేత్ దేశ్‌పాండే ఈ సందర్భంగా అన్నారు.
ఐఎస్బీతో ఎంవోయూ
హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక బిజినెస్ స్కూల్.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఓ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంవోయూ) కుదుర్చుకున్నది. ఈ మేరకు మంగళవారం ఇక్కడ ఇరు సంస్థల వర్గాలు ఎంవోయూపై సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నాయి. కాగా, డిజిటల్ సంసిద్ధతపై పరిశోధనల నిర్వహణకు ఈ అవగాహన ఒప్పందం దోహదం చేయనున్నది. ఈ డిజిటల్ సంసిద్ధత సూచీ.. సంస్థల్లో స్టేట్ ఆఫ్ డిజిటైజేషన్ మదింపునకు ఓ పరికరంగా ఉపయోగపడనున్నది.
‘ప్రతిభ, టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్ల కోసం నేడు తెలంగాణే అందరి ఎంపిక. ఇది మా కృషికి ఫలితం. రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ ఎంతో సులభతరమైంది. ఎల్టీఐ వంటి గ్లోబల్ సంస్థల రాక పెరగడమే ఇందుకు నిదర్శనం. కొత్త సెంటర్‌ను ప్రారంభించిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్‌కు నా శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో మైలురాళ్లను సంస్థ అధిగమించాలని కోరుకుంటున్నాను’
-కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి