Car Smuggling Case | ఖరీదైన లగ్జరీ ఎస్యూవీ (SUV) కార్ల స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన కేసులో ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్‌ను కస్టమ్స్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ పేరుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ విచారణలో భాగంగా, కొచ్చిలోని కస్టమ్స్ కార్యాలయంలో ఆయనను సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దుల్కర్ సల్మాన్‌కు చెందిన నాలుగు లగ్జరీ వాహనాలను కస్టమ్స్ అధికారులు గతంలోనే సీజ్ చేయగా, వాటిలో రెండింటిని ఆయన ముందే తాత్కాలికంగా విడిపించుకున్నారు. అయితే మిగిలిన రెండు వాహనాలను విడిపించేందుకు ఆయన ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే దుల్కర్ వద్ద ఉన్న ఇతర ఖరీదైన వాహనాల వివరాలను కూడా సేకరించిన అధికారులు, అవసరమైతే వాటిని కూడా తనిఖీల కోసం తమ ముందుకు తీసుకురావాల్సిందిగా ఆయనకు సూచించే అవకాశం ఉంది.
ఈ విచారణలో భాగంగా దుల్కర్ సల్మాన్‌తో పాటు ఈ అక్రమ వాహనాలతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మరో నలుగురిని కూడా అధికారులు ప్రశ్నించారు. అసలు ఈ కేసు వివరాల్లోకి వెళ్తే… భూటాన్, నేపాల్ సరిహద్దుల గుండా పాత లగ్జరీ వాహనాలను నకిలీ పత్రాలు సృష్టించి భారతదేశంలోకి అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ మార్గం ద్వారా భారీ మొత్తంలో కస్టమ్స్ డ్యూటీ ఎగవేస్తున్నట్లు తేలింది. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి కస్టమ్స్ అధికారులు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 60 వాహనాలను సీజ్ చేయగా, ఈ స్మగ్లింగ్ ముఠాతో సంబంధమున్న ఏడుగురిని అరెస్ట్ చేసి విచారణను మరింత వేగవంతం చేశారు.