Gas Cylinder | ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయన్న సాకుతో కేంద్ర పెట్రోలియం సంస్థలు సోమవారం మరోమారు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వంటగ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.266 పెంచివేశాయి.
రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ బండ్ల వద్ద ఈ కమర్షియల్ సిలిండర్ వాడతారు. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్రీయ చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో చెన్నైలో అత్యధికంగా రూ.2,133 పలుకుతున్నది. ఢిల్లీలోనూ రూ.2000 మార్క్‌ను దాటేసింది. కాకపోతే ఇండ్లలో వాడే వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచకపోవడమే కాసింత ఊరట.
ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2000.50 కాగా, ముంబైలో రూ.1950, కోల్‌కతాలో రూ.2,073.50 పలుకుతున్నది. మామూలుగా కేంద్ర పెట్రోలియం సంస్థలు ప్రతి 15 రోజులకోసారి గ్యాస్ సిలిండర్ ధరలు సవరిస్తున్నాయి. గృహ వినియోగ వంట గ్యాస్ ధరల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే రూ.100 వరకు నష్టం వస్తున్నదని కేంద్ర పెట్రోలియం సంస్థలు వాదిస్తున్నాయి. దీన్ని భర్తీ చేసుకోవాలంటే ధర పెంచక తప్పదంటున్నాయి.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.205 పెరిగి రూ.1000కి చేరువలో ఉంది. గత నెలలోనూ తొలుత కమర్షియల్ సిలిండర్ ధర పెంచిన కేంద్ర పెట్రోలియం సంస్థలు.. ఆరో తేదీన గృహ వినియోగ వంట గ్యాస్‌పైన వడ్డించాయి. ఈ దఫా కూడా అలాగే చేస్తారేమోనని సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు.