Bernard Arnault – Elon Musk | ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడిగా లగ్జరీ బ్రాండ్ల తయారీ సంస్థ ఎల్వీఎంహెచ్ చైర్మన్ కం సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ నిలిచారు. ఇప్పటి వరకూ ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌ను దాటేశారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఆయన కుటుంబ నికర సంపద శుక్రవారం నాటికి 23.6 బిలియన్ డాలర్లు పెరిగి 207.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. మరోవైపు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ నికర వ్యక్తిగత సంపద 204.5 బిలియన్ డాలర్లకు పరిమితమైందని ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ లిస్ట్ పేర్కొంది. అయితే బెర్నార్డ్ ఆర్నాల్ట్ సారధ్యంలోని ఎల్వీఎంహెచ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 388.8 బిలియన్ డాలర్లు కాగా, టెస్లా ఎం-క్యాప్ 586.14 బిలియన్ డాలర్లు.
ఈ ఏడాది సేల్స్ నెమ్మదిస్తాయని ఎలన్ మస్క్ ప్రకటించడంతో గురువారం స్టాక్ మార్కెట్లలో టెస్లా షేర్లు 12 శాతానికి పైగా నష్టపోయాయి. దీంతో గురువారం ఒక్క రోజే 80 బిలియన్ డాలర్ల ఎం-క్యాప్ కోల్పోతే, ఈ నెలలో 210 బిలియన్ డాలర్లు నష్టపోయింది. మరోవైపు ఎల్వీఎంహెచ్ తన నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో సేల్స్ 10 శాతం పెరిగాయి.
బెర్నార్డ్ అర్నాల్ట్& కుటుంబం నికర సంపద – 207.6 బిలియన్ డాలర్లు
ఎలన్ మస్క్ – 204.7 బిలియన్ డాలర్లు
జెఫ్ బెజోస్ -181.3 బిలియన్ డాలర్లు
ల్యారీ ఎల్లిసన్ -142.2 బిలియన్ డాలర్లు
మార్క్ జుకర్ బర్గ్ – 139.1 బిలియన్ డాలర్లు
వారెన్ బఫెట్ – 127.2 బిలియన్ డాలర్లు
ల్యారీ పేజ్ -127.1 బిలియన్ డాలర్లు
బిల్ గేట్స్ – 122.9 బిలియన్ డాలర్లు
సెర్జెయ్ బ్రిన్ – 121.7 బిలియన్ డాలర్లు
స్టీవ్ బాల్మర్ – 118.8 బిలియన్ డాలర్లు
ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. ఆయన నికర వ్యక్తిగత సంపద 104.4 బిలియన్ డాలర్లు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ వ్యక్తిగత సంపద 75.7 బిలియన్ డాలర్లతో ఆయన 16వ స్థానంలో నిలిచారు.