న్యూఢిల్లీ, జూన్ 18: నేర్చుకోవడానికి వీలుగా మా సంస్థలు అన్ని అవకాశాలు కల్పిస్తున్నా వాటిని అందిపుచ్చుకోలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. పని ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతల వల్లే నైపుణ్యాభివృద్ధిలో వెనుకబడుతున్నట్టు మెజారిటీ ఎంప్లాయిస్ చెప్తున్నారు. అవును.. దేశంలోని ప్రతీ 10 మంది ఉద్యోగ నిపుణుల్లో 9 మందిది ఇప్పుడిదే మాట అంటున్నది ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ తాజా నివేదిక ఒకటి. మార్కెట్లో వస్తున్న మార్పులకు, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ ఉద్యోగులకు తర్ఫీదునిస్తూపోతున్నాయి చాలా కంపెనీలు. అయితే ఆఫీస్లో పని భారం, వ్యక్తిగత లేదా కుటుంబ బాధ్యతలతో సతమతమైపోతూ శిక్షణపై అత్యధిక ఉద్యోగులు దృష్టి సారించలేకపోతున్నారు. 91 శాతం ఉద్యోగులది ఇదే పరిస్థితి అని లింక్డ్ఇన్ తాజా అధ్యయనంలో తేలింది.
లౌడ్ లెర్నింగ్
పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో కంపెనీలు ఇస్తున్న స్కిల్ డెవలప్మెంట్పై ఆసక్తి చూపలేకపోతున్న ఉద్యోగులు.. తమకున్న అడ్డంకులను అధిగమించడానికి ‘లౌడ్ లెర్నింగ్’ మంత్రాన్ని జపిస్తున్నారు. ఆఫీసులు లేదా పనిచేసే చోట నేర్చుకోవాలన్న లక్ష్యాలపై తమకున్న ఆసక్తిని ఉద్దేశపూర్వకంగా గట్టిగా వ్యక్త పరిచే చర్యనే ఈ ‘లౌడ్ లెర్నింగ్’ అంటారు. ఇది తమ కెరియర్ వృద్ధికి దోహదపడగలదని ఏకంగా 79 శాతం మంది ఉద్యోగులు విశ్వసిస్తుండటం గమనార్హం.
ఇక లింక్డ్ఇన్ సైతం ఉద్యోగ నిపుణుల కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత అత్యుత్తమ సాధనాలను అందుబాటులోకి తెచ్చింది. కాగా, అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి మెంటార్షిప్, గైడెన్స్ అవసరమని, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా శిక్షణ కావాలని, మారుతున్న టెక్నాలజీ, పరిస్థితులపై అవగాహనను పెంచుకోవడం తప్పనిసరి అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఎక్కువమంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఏఐ ఆధారిత సేవలు, ఉత్పాదకతపై దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా సర్వే ప్రాధాన్యతను సంతరించుకున్నది.
దేశంలో ఉద్యోగాల కోసం ఇప్పుడు అవసరమైన నైపుణ్యాల్లో 2030 నాటికి 64 శాతం మారిపోవచ్చు. అందుకే ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఆహ్వానిస్తూపోవాలి. నయా టెక్నాలజీలు, నూతన అంశాలపై దృష్టి సారించి వాటిలో ఆరితేరాలి. అప్పుడే కొలువులు భద్రంగా ఉంటాయి.
-నిరాజితా బెనర్జీ, లింక్డ్ఇన్ కెరియర్ ఎక్స్పర్ట్