ముంబై, డిసెంబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గోరోజూ పడిపోయాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 77.84 పాయింట్లు లేదా 0.09 శాతం నష్టపోయి 84,481.81 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 84,780.19 స్థాయికి పెరిగినా.. మరొక సమయంలో 84,238.43 పాయింట్లకు పతనమైంది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య మదుపరులు లాభాల స్వీకరణకే పెద్దపీట వేశారని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ స్వల్పంగా 3 పాయింట్లు తగ్గింది. 25,815.55 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, అమెరికాతో ఇంకా కుదరని వాణిజ్య ఒప్పందం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. కాగా, విద్యుత్తు, చమురు-గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, యుటిలిటీస్, ఇండస్ట్రియల్స్ షేర్లు నిరాశపర్చాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.05 శాతం పెరిగితే, స్మాల్‌క్యాప్ 0.28 శాతం నష్టపోయింది.