Banks Interest Rates on FDs | ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే ఇన్వెస్టర్లకు బ్యాంకులు తీపి కబురందిస్తున్నాయి. దశాబ్ధాల స్థాయి కనిష్ట స్థాయి వడ్డీరేట్ల తర్వాత బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లు పెంచేశాయి. మే, జూన్ నెలల్లో భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రెండు దఫాల్లో 90 బేసిక్ పాయింట్ల రెపోరేట్ పెంచేసింది. తదనుగుణంగా వివిధ వాణిజ్య బ్యాంకులు.. విభిన్న టెన్యూర్లకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచాయి. గత రెండు వారాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు పెంచిన వడ్డీరేట్ల వివరాలపై ఓ లుకేద్దామా..!
కొన్ని నిర్ధిష్ఠ టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు 20 బేసిక్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది ఎస్బీఐ. ఈ నెల 14 నుంచి ఈ పెరుగుదల అమల్లోకి వస్తుంది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఈ పెరుగుదల వర్తిస్తుంది. నూతన డిపాజిట్లు, మెచ్యూర్డ్ ఎఫ్డీ రెన్యూవల్స్‌కు ఇది వర్తిస్తుంది.
మరో ప్రభుత్వ రంగ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వివిధ రకాల టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)లపై వడ్డీరేటు 10 బేసిక్ పాయింట్లు పెంచివేసింది. ఈ నెల 14 నుంచి పెరుగుదల అమల్లోకి వచ్చింది. ఒకటి, రెండేండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 5.10 నుంచి 5.20 శాతానికి పెరిగింది.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వారంలో రెండు దఫాలు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచింది. ఈ నెల 17 నుంచి నూతన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 25 బేసిక్ పాయింట్లు వడ్డీరేటు పెరిగింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. ఏడు రోజుల నుంచి 29 రోజుల్లోపు ఎఫ్డీలపై 2.50 నుంచి 2.75 శాతం, 90 రోజుల్లోపు 3 నుంచి 3.25 శాతం వడ్డీ పెరిగింది.
ఐసీఐసీఐ బ్యాంక్ పలు టెన్యూర్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై రెండు దఫాలు వడ్డీరేట్లు పెంచివేసింది. రూ.2 కోట్ల లోపు ఎఫ్డీలపై ఐదు బేసిక్ పాయింట్ల వడ్డీ పెరిగింది. ఈ నెల 22 నుంచి పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి. వివిధ టెన్యూర్ల ఎఫ్డీలపై వడ్డీరేటు 2.75 నుంచి 5.75 శాతం వరకు పెరిగింది.
రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లు సవరించింది. సవరించిన వడ్డీరేట్లు ఈ నెల 16 నుంచి అమల్లోకి వచ్చాయి. విభిన్న టెన్యూర్లు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు మూడు శాతం నుంచి 5.80 శాతం వరకు పెరిగాయి. ఏడాది నుంచి రెండేండ్లలోపు ఎఫ్డీలపై 5.45 శాతం, మూడేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ మీద వడ్డీ 5.50 శాతానికి సవరించింది.
కొన్ని నిర్ధిష్ఠ గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచేసింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీరేట్లు 16 నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడాది లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటులో ఎటువంటి తేడా లేదు. 5-10 ఏండ్ల మధ్య గడువు గల పిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీరేటు యధాతథంగా కొనసాగుతుంది.
మరో బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచివేసింది. సాధారణ పౌరులకు గరిష్ఠంగా 6.50 శాతం వడ్డీరేటు, వృద్ధులకు ఏడు శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నది. పెరిగిన వడ్డీరేట్లు ఈ నెల 21 నుంచి అమల్లోకి వస్తాయి. 61 నెలలు, అంతకంటే మొత్తం టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు ఆరు శాతం, రెండేండ్ల నుంచి 61 నెలల వరకు డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ అందిస్తున్నది.
ప్రైవేట్ రంగ బ్యాంక్.. డీసీబీ బ్యాంక్ 18 నెలల్లోపు గడువుతోపాటు రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచివేసింది. పెరిగిన వడ్డీరేటు ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చింది. తాజా మార్పునకు అనుగుణంగా 18 నెలల నుంచి 120 నెలల్లోపు పెట్టుబడులపై 6.60 శాతం వడ్డీ లభిస్తుంది.
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించేసింది. ఈ నెల 22 నుంచి పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి. ఏడు రోజుల నుంచి 2,223 రోజుల గడువు వరకు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 2.75 నుంచి 5.95 శాతం మధ్య చెల్లిస్తుంది.
ఫిక్స్డ్ డిపాజిట్లపై కెనరా బ్యాంక్ నూతన టర్మ్ ప్రవేశపెట్టింది. కొత్తగా 333 రోజుల గడువు గల స్కీమ్‌పై వడ్డీరేటు 5.10 శాతంగా ఖరారు చేసింది. ఇది వృద్ధులకు 5.60 శాతం వడ్డీరేట్ ఆఫర్ చేస్తున్నది. ఈ నెల 23 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లలో బల్క్ డిపాజిట్లను అనుమతించడం లేదు. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించింది. ఈ నెల 23 నుంచి పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు 2.85 శాతం నుంచి 5.50 శాతం మధ్య ఉంటాయి.