న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఇన్సూరెన్స్ ఏజెంట్లకు బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ షాకివ్వబోతున్నదా! ప్రస్తుత చర్యలు చూస్తే నిజమేననిపిస్తున్నది. పాలసీదారులను ఆకట్టుకోవడానికి బీమా సంస్థలు పెడుతున్న ఖర్చులను నియంత్రించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది. సాధారణ, హెల్త్ బీమా రంగ సంస్థలు ఆర్జిస్తున్న స్థూల ప్రీమియం వసూళ్ళలో తమ ఖర్చును 30 శాతానికి పరిమితం చేసే ఉద్దేశంలో భాగంగా ఇన్సూరెన్స్ ఏజెంట్ల కమీషన్లకు కత్తెర పెడుతున్నది.
కమీషన్లతోపాటు రెమ్యూనరేషన్, రివార్డులకు కూడా పరిమితులు విధించబోతున్నది. దీంట్లోభాగంగా ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా ఏజెంట్లకు ఇస్తున్న కమీషన్‌ను 20 శాతానికి కుదించే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథార్టీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ). కమీషన్ పరిమితులపై కన్సల్టేషన్ పేపర్‌ను కూడా విడుదల చేసింది నియంత్రణ మండలి. ఏజెంట్లకు ఇచ్చే కమీషన్లపై కూడా ఆయా సంస్థల బోర్డు అనుమతించాల్సి ఉంటుంది.
ఈ ప్రతిపాదనలపై బీమా సంస్థల అభిప్రాయాలను తెలుసుకోనున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. వచ్చే నెల 14 సాయంత్రం 5 గంటలలోగా sumandeep.ghosh@ irdai.gov.in తోపాటు uma@irdai. gov.in కు తమ సూచనలు చేయావచ్చని ఐఆర్డీఏఐ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. బీమా రంగంలో నూతన ఆవిష్కరణలు, ఆయా సంస్థలు నూతన వ్యాపార పద్దతులు, పాలసీలు, వ్యూహాత్మక, ఇతర విభాగాల్లో నూతనంగా సేవలు అందించేందుకు ఐఆర్డీఏఐ మార్గదర్శకాలను మరింత సరళతరం చేస్తున్నది.