కరోనా నేపథ్యంలో దవాఖాన ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు చాలామందికి ఉద్యోగ రిత్యా కంపెనీ ఇచ్చే గ్రూప్ హెల్త్ పాలసీ, ఫ్యామిలీ ఫ్లోటర్, వ్యక్తిగత బీమా ఇలా ఒకటికి మించి ఆరోగ్య బీమా పాలసీలు ఉంటున్నాయి. ఇలాంటప్పుడే ఏ పాలసీ నుంచి క్లెయిమ్ చేయాలి? అసలు ఒకటి కన్నా ఎక్కువ పాలసీలను క్లెయిమ్ చేయవచ్చా? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకరు ఎన్ని పాలసీలైనా క్లెయిమ్ చేయవచ్చు. దాదాపు గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలకు నోక్లెయిమ్ బోనస్ ఉండదు. వ్యక్తిగత బీమా పాలసీని ఏడాదిలో క్లెయిమ్ చేయకపోతే నోక్లెయిమ్ బోనస్‌తో వచ్చే ఏడాదికి బీమా కవరేజీ పెరుగుతుంది. కాబట్టి ఒకవేళ దవాఖాన బిల్లు.. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీకి దిగువనే ఉంటే నిస్సందేహంగా దాన్నే క్లెయిమ్ చేయండి. అంతకన్నా ఎక్కువగా ఉంటే తొలుత గ్రూప్ పాలసీని, మిగతా మొత్తానికి వ్యక్తిగత పాలసీని ఉపయోగించండి.
రెండో పాలసీ క్లెయిమ్..
మొదట గ్రూప్ పాలసీని క్లెయిమ్ చేసిన తర్వాత ఇచ్చే సెటిల్మెంట్ సమ్మరీ డాక్యుమెంట్‌ను, దవాఖాన బిల్లుల కాపీలను తీసుకోండి. మిగతా మొత్తానికి క్లెయిమ్ చేయడానికి ఇవే ప్రధాన డాక్యుమెంట్లు. దీనికి ముందు ఏ పాలసీకి ఎంతెంత కవరేజీ ఉందో ముందే గుర్తుంచుకోండి. అలాగే ఎందులో రైడర్లు అదనపు ప్రయోజనాలు ఉన్నాయో చూడండి. వాటికి అనుగుణంగా క్లెయిమ్‌లను చేయండి.