న్యూఢిల్లీ, మే 10: దేశంలోని జీవిత బీమా సంస్థలు వ్యాపార వృద్ధిలో జోరు చూపిస్తున్నాయి. ముగిసిన ఏప్రిల్ నెలలో ఆ కంపెనీల కొత్త ప్రీమియం ఆదాయం 84 శాతం వృద్ధిచెంది రూ. 17,940 కోట్లకు పెరిగినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 24 జీవిత బీమా సంస్థల కొత్త ప్రీమియం ఆదాయం నిరుడు ఏప్రిల్లో రూ. 9,739 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఏప్రిల్లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం రెట్టింపునకుపైగా పెరగడంతో మొత్తం పరిశ్రమ ఆదాయంలో సైతం భారీ వృద్ధి కన్పిస్తున్నది.
ఎల్ఐసీ సమీకరించిన తొలి సంవత్సరపు ప్రీమియం ఏప్రిల్లో రూ. 4,857 కోట్ల నుంచి రూ. 11,716 కోట్లకు పెరిగినట్టు ఐఆర్డీఏఐ తెలిపింది. ఈ ఆదాయంలో ఎల్ఐసీ మార్కెట్ వాటా 65.31 శాతంకాగా, మిగిలిన 23 ప్రైవేటు కంపెనీల మొత్తం వాటా 34.69 శాతం. ప్రైవేటు బీమా సంస్థల కొత్త బిజినెస్ ప్రీమియం ఈ ఏప్రిల్లో రూ.6,223 కోట్లకు చేరింది. గత ఏడాది ఏప్రిల్లో ఇది రూ. 4,882 కోట్లు. ఎల్ఐసీ తర్వాత అధికంగా కొత్త ప్రీమియం ఆదాయాన్ని యూనియన్ దైచీ లైఫ్ (122 శాతం) పెంచుకోగా, టాటా ఏఐఏ లైఫ్ 107 శాతం వృద్ధి సాధించింది. మొత్తం 24 కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్లో పాలసీలను 32 శాతం పెంచుకోవడంతో వీటి సంఖ్య 13,21,098కు చేరింది. ఇందులో ఎల్ఐసీవి 9,13,141 కాగా (31.92 శాతం వృద్ధి), ప్రైవేటు కంపెనీలవి 3,04,748 (33.87 శాతం వృద్ధి).