LIC | న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశీయ అతిపెద్ద బీమా సంస్థ, ప్రభుత్వ రంగ జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ).. ఆరోగ్య బీమాలోకి ప్రవేశించే అంశంలో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్‌లో 50 శాతందాకా వాటాను కొనేందుకు గట్టిగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి వెళ్దామని ఎల్ఐసీ ఎప్పట్నుంచో యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్తగా ఓ సంస్థను పెట్టి దానిద్వారా ఈ సెగ్మెంట్లో ముందుకెళ్లడం కంటే ఇప్పటికే ఉన్న సంస్థలో వాటాను సొంతం చేసుకొని వెళ్లడమే లాభదాయకం అని ఎల్ఐసీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే మణిపాల్‌సిగ్నాలో వాటాల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు చెప్తున్నారు. ఈ నెల 8న ఎల్ఐసీ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి ఆఖర్లోగా ఇప్పటికే ఆరోగ్య బీమా సేవల్ని అందిస్తున్న కంపెనీలో వాటాను కొంటామని, తద్వారా ఈ విభాగంలోకి వస్తామని ఆయన చెప్పారు. అయితే ఏ సంస్థలో వాటాను కొంటామన్న వివరాల్ని మాత్రం తెలియపర్చలేదు.
మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఓ ఇండో-అమెరికన్ జాయింట్ వెంచర్. బెంగళూరు ఆధారిత మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్, అమెరికాకు చెందిన సిగ్నా కార్పొరేషన్ కలిసి ఏర్పాటు చేశాయి. ఇందులో మణిపాల్ గ్రూప్‌నకు 51 శాతం వాటా ఉన్నది. మిగతా 49 శాతం వాటా సిగ్నాది. అయితే ఈ డీల్ కుదిరితే ఎల్ఐసీకి దామాషా ప్రకారం అటు మణిపాల్ గ్రూప్, ఇటు సిగ్నా రెండూ కలిసి తమ వాటాల నుంచి 50 శాతం వాటాను అమ్మవచ్చని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. మణిపాల్‌సిగ్నా స్టాక్ మార్కెట్లలో నమోదు కాలేదు. ఇది కూడా ఇందులోనే ఎల్ఐసీ వాటా కొనేందుకు దోహదం చేస్తున్నది. స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇన్సూరెన్స్, నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్‌లు స్టాక్ మార్కెట్లలో నమోదయ్యాయి. దీంతో వాటి మార్కెట్ విలువ వరుసగా రూ.13,740 కోట్లు, రూ.26,843 కోట్లుగా ఉన్నాయి. వీటితో పోల్చితే మణిపాల్సిగ్నానే ఎల్ఐసీకి చౌకగా లభిస్తున్నది.
మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఎల్ఐసీ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్టు ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వార్తల్నిబట్టి తెలుస్తున్నది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2023-24) మణిపాల్‌సిగ్నా ప్రీమియం వసూళ్లు స్థూలంగా రూ.1,691 కోట్లుగా ఉన్నాయి. అలాగే కంపెనీ విలువను రూ.3,500-4,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీంతో డీల్ కుదిరితే 50 శాతం వాటాకు ఎల్ఐసీ రూ.1,750-2,000 కోట్లు చెల్లించాల్సి రావచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్‌కు నానాటికీ పెరుగుతున్న ఆదరణ దృష్ట్యానే ఎల్ఐసీ ఈ వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకున్నది. ప్రస్తుతం రూ.3 లక్షల కోట్ల జనరల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో 37 శాతం వాటా హెల్త్ ఇన్సూరెన్స్దే.
బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. బ్యాంక్ అస్యూరెన్స్ బిజినెస్‌కు పరిమితుల్ని పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీమా సంస్థకు, బ్యాంకుకు మధ్య కుదిరే భాగస్వామ్య ఒప్పందాన్నే బ్యాంక్అస్యూరెన్స్ అంటారు. ఇందులో బ్యాంక్ కస్టమర్లకు ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీలను బ్యాంకుల ద్వారానే అమ్ముతూంటాయి. అయితే పాలసీలను అమ్మే విషయంలో బ్యాంకులపై బీమా సంస్థలు అధికంగా ఆధారపడటం మంచిది కాదని, దీనివల్ల సదరు బ్యాంకులు ఆర్థిక ఇబ్బందుల్లో పడితే పాలసీదారులూ నష్టపోతారని ఐఆర్డీఏఐ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం రిస్క్‌తో కూడిన విధానాల ద్వారా బీమా పాలసీలను అమ్మడం ఆపాల్సిన అవసరం ఉందని ఇటీవల అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలోనే ఐఆర్డీఏఐ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నది. ఇన్సూరెన్స్ కంపెనీలు తమ మొత్తం వ్యాపారంలో బ్యాంకుల ద్వారా జరుగుతున్న వ్యాపారాన్ని 50 శాతానికి తగ్గించుకోవాలని ఐఆర్డీఏఐ కోరినట్టు ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నివేదిక చెప్తున్నది. వచ్చే కొద్దినెలల్లో ఈ వ్యవహారంపై ఐఆర్డీఏఐ ఓ తుది నిర్ణయం తీసుకోవచ్చని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 90 శాతం వ్యాపారం ఎస్బీఐ ద్వారానే జరుగుతున్నది. అలాగే హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో 85 శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ద్వారానే వస్తున్నది. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మొత్తం వ్యాపారంలో యాక్సిస్ బ్యాంక్‌తో అందుకుంటున్నదే 90 శాతం. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో ఐసీఐసీఐ బ్యాంక్ వాటా దాదాపు 50 శాతంగా ఉన్నది. మరోవైపు ఐఆర్డీఏఐ ఆలోచనతో గురువారం స్టాక్ మార్కెట్లలో ఆయా ఇన్సూరెన్స్ సంస్థల షేర్లు పడిపోయాయి. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ షేర్ల విలువ 3.29-5.41 శాతం మేర నష్టపోయాయి.