ముంబై, డిసెంబర్ 3 : ప్రభుత్వ రంగ బీమా దిగ్గజ సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) బుధవారం రెండు సరికొత్త ప్లాన్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ప్రొటెక్షన్ ప్లస్ (ప్లాన్ 886), బీమా కవచ్ (ప్లాన్ 887)లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ప్రొటెక్షన్ ప్లస్ అనేది నాన్ పార్టిసిపేటింగ్, లింక్డ్, జీవిత, వ్యక్తిగత, పొదుపు పథకం. పాలసీదారులకు జీవిత బీమా కవరేజీతోపాటు, పాలసీ వ్యవధిలో సేవింగ్స్ ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇక బీమా కవచ్ అనేది నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, జీవిత, వ్యక్తిగత, పూర్తి రిస్క్ ప్లాన్. పాలసీ వ్యవధిలో పాలసీదారుడు దురదృష్టవశాత్తు చనిపోతే అతని కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్లో మరణానంతర ప్రయోజనాలు ఫిక్స్డ్, గ్యారంటీడ్. ఇక బీమా కవచ్ కింద మహిళలు, ధూమపానం చేయనివారి కోసం ప్రత్యేక ప్రీమియం రేట్లూ ఉంటాయని ఓ ప్రకటనలో ఎల్ఐసీ తెలియజేసింది. మరిన్ని వివరాల కోసం ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ www. licindia.inను సంప్రదించవచ్చు.