LIC | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) త్వరలో ఐపీవోకు వెళ్లనున్న నేపథ్యంలో పాలసీదారులకు మరోమారు రిలీఫ్ ఇచ్చింది. నిలిచిపోయిన వ్యక్తిగత బీమా పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రక్రియ వచ్చే సోమవారం (ఫిబ్రవరి 7) నాడు మొదలై, వచ్చేనెల 25 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. కొవిడ్ సంక్షోభంతో కుటుంబాల ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నం కావడంతో పాలసీ దారులకు ఈ అవకాశం కల్పించామని పేర్కొంది. మహమ్మారి వల్ల ప్రజలకు బీమా రక్షణ ఎంత అవసరమన్న విషయం కూడా తెలిసి వచ్చిందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో పాలసీల పునరుద్ధరణకు ఎల్ఐసీ అనుమతించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
పాలసీల పునరుద్ధరణ గడువు మాత్రం ఐదేండ్లు, అంతకంటే తక్కువ టైంలో నిలిచిపోయిన పాలసీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని ఎల్ఐసీ వెల్లడించింది. పాలసీ రెన్యూవల్‌కు ముందుకొచ్చే వారికి ఆలస్య ఫీజులోనూ రాయితీ ఇస్తామని వివరించింది. పాలసీ మొత్తాన్ని బట్టి ఇది ఆధార పడి ఉంటుందని తెలిపింది.
ఆగిపోయిన పాలసీ ప్రీమియం విలువ రూ. లక్షలోపు ఉంటే 20 శాతం లేదా గరిష్టంగా రూ.2000 రాయితీ ఇస్తామని ఎల్ఐసీ తెలిపింది. ప్రీమియం రూ.3 లక్షలు దాటితే 30 శాతం లేదా రూ.3000 రాయితీ అందుకోవచ్చునని వివరించింది.