ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ).. ఓ ఆకర్షణీయ పెన్షన్ ప్లాన్‌ను అందిస్తున్నది. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యోజన పేరిట ఇది అందుబాటులో ఉన్నది. ఇందులో ఒకేసారి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే.. ఏటా పెద్ద మొత్తాన్ని పింఛన్‌గా అందుకోవచ్చు. తొలుత స్టాండర్డ్ ఇమ్మీడియేట్ యాన్యుటీ ప్లాన్‌గా పరిచయమైన ఈ స్కీం.. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకున్న గొప్ప అవకాశాల్లో ఒకటిగా ఇప్పుడు నిలుస్తున్నదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
రూ.10 లక్షలతో..
60 ఏండ్ల వ్యక్తి రూ.10 లక్షలను ఈ ప్లాన్‌లో ఒకేసారి పెట్టుబడిగా పెడితే.. ఏటా రూ.58,950 చొప్పున పింఛన్‌గా పొందవచ్చు. పాలసీదారు మరణానంతరం నామినీలకు పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుంది. అలాగే ప్లాన్ కొనుగోలుదారులు రెండు ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మొదటిది జీవితకాల యా న్యుటీ, రెండోది ఉమ్మడి జీవిత యాన్యు టీ. కనిష్ఠంగా 40 ఏండ్లు, గరిష్ఠంగా 80 ఏండ్లవారు ఈ ప్లాన్ కొనుగోలుకు అర్హులు. నెల, త్రైమాసిక, వార్షిక పద్ధతుల్లో యాన్యుటీ చెల్లింపులకు వీలున్నది. ఆసక్తిగలవారు ఆన్‌లైన్‌లోగానీ, ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ www. licindia.inలోగానీ కొనుక్కోవచ్చు.