న్యూఢిల్లీ, మే 5: తక్కువ విలువతో ఐపీవోలో లభిస్తున్న షేర్లు..పైగా ఆఫర్ ధరలో డిస్కౌంట్..అంతే పాలసీదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఐపీవోకు క్యూ కట్టారు. ఐపీవో మొదలైన రెండోరోజునే పాలసీదారుల పోర్షన్ భారీగా 3 రెటుపైగా ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాకు సైతం దాదాపు పూర్తిగా సబ్స్క్రిప్షన్ లభించింది. ఫలితంగా రెండోరోజైన గురువారం బిడ్డింగ్ సమయం ముగిసేటప్పటికి ఐపీవో పూర్తిగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఆఫర్లో 16.21 కోట్ల ఎల్ఐసీ షేర్లు అందుబాటులో ఉండగా, 16.69 కోట్ల షేర్లకు (1.03 రెట్లు) దరఖాస్తులు అందాయి. ఈ ఐపీవో ద్వారా 3.5 శాతం వాటాను (22.13 కోట్ల షేర్లు) విక్రయించాలన్నది ప్రభుత్వ లక్ష్యంకాగా, మే 2న యాంకర్ ఇన్వెస్టర్లకు 5.93 కోట్ల షేర్లను కేటాయించిన సంగతి తెలిసిందే. మిగిలిన 16.20 కోట్ల షేర్ల అమ్మకానికి మే 5న ప్రారంభమైన ఆఫర్ మే 9తో ముగుస్తుంది. పాలసీ హోల్డర్ల కోసం 2.21 కోట్ల షేర్లను రిజర్వ్చేయగా, వీరి నుంచి 6.89 కోట్ల షేర్లను (3.11 శాతం) కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. వీరికి సంస్థ షేరుకు రూ.60 చొప్పున డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టాక్ ఎక్సేంజ్‌ల్లో పొందుపర్చిన సమాచారం ప్రకారం ఉద్యోగుల విభాగం సైతం రెండు రెట్లకుపైగా ఓవర్సబ్స్ర్కైబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో 6.92 కోట్ల షేర్లు విక్రయానికి ఉండగా, 6.45 కోట్ల షేర్లకు (93 శాతం) బిడ్స్ వేసారు. రిటైలర్లు, ఉద్యోగులకు షేరు రూ.45 చొప్పున డిస్కౌంట్ లభిస్తుంది.