న్యూఢిల్లీ, మే 30: బీమా రక్షణను, పొదుపును అందిస్తూ ఎల్ఐసీ కొత్తగా ‘బీమా రత్న’ పేరుతో ఒక పాలసీని విడుదల చేసింది. పాలసీదారు వివిధ ఆర్థిక అవసరాలకు విడతలవారీగా కొంత మొత్తాన్ని అందించడం, పాలసీ అమలులో ఉన్నపుడు పాలసీదారు అకాలమరణం చెందితే ఆ కుటుంబానికి ఆర్థిక మద్దతును ఇవ్వడం ‘బీమా రత్న’ ప్రధాన ప్రయోజనాలు. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత పొదుపు జీవిత బీమా పథకం. ఫీచర్లివే..
డెత్ బెనిఫిట్: పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే బీమా హామీ మొత్తాన్ని గ్యారంటీడ్ ఎడిషన్స్ను నామినీకి చెల్లిస్తారు. బేసిక్ హామీ మొత్తానికి 125 శాతం లేదా ఏడు రెట్లు వార్షిక ప్రీమియంల్లో ఏది ఎక్కువైతే దానిని చెల్లిస్తారు. మరణించే తేదీనాటికి చెల్లించిన ప్రీమియంల మొత్తంలో 105 శాతానికి తక్కువ కాకుండా ఈ చెల్లింపు ఉంటుంది. గ్యారంటీడ్ ఎడిషన్స్ కూడా లభిస్తాయి.
సర్వైవల్ బెనిఫిట్: 15 ఏండ్ల కాలపరిమితికి పాలసీ తీసుకుంటే 13, 14 సంవత్సరాలు ముగిసిన తర్వాత బేసిక్ హామీలో 25 శాతం చొప్పున చెల్లింపు జరుగుతుంది. 20 సంవత్సరాల పాలసీకి 18,19 సంవత్సరాల్లో, 25 ఏండ్ల పాలసీకి 23,24 సంవత్సరాల్లో 25 శాతం చొప్పున చెల్లింపు ఉంటుంది.
మెచ్యూరిటీ బెనిఫిట్: పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీపై హామీ ఇచ్చిన మొత్తంతో పాటు ఇప్పటివరకూ వచ్చిన గ్యారంటీడ్ ఎడిషన్స్ను చెల్లిస్తారు. మెచ్యూరిటీపై ఆఫర్ చేసే హామీ మొత్తం..బేసిక్ హామీ మొత్తంలో 50 శాతం ఉంటుంది.
గ్యారంటీడ్ ఎడిషన్స్: పాలసీ ప్రారంభమైన తర్వాత తొలి ఏడాది నుంచి ఐదో ఏడాది వరకూ ప్రతీ రూ.1000 బేసిక్ హమీ మొత్తంపై రూ. 50 చొప్పున గ్యారంటీడ్ ఎడిషన్స్ ఉంటాయి. 6 నుంచి 10వ ఏడాది వరకూ ఇది రూ.55, 11వ ఏడాది నుంచి 25వ సంవత్సరం వరకూ రూ.60 చొప్పున ఉంటుంది. అయితే పాలసీ అమలులో ఉన్నంతవరకూ సకాలంలో ప్రీమియం చెల్లిస్తూ ఉంటేనే ఈ గ్యారంటీడ్ ఎడిషన్స్ లభిస్తాయి.
బేసిక్ సమ్ అష్యూర్డ్: ఈ పాలసీ కనీసం రూ.5 లక్షల బేసిక్ హామీ మొత్తంలో లభిస్తున్నది. అటుపై రూ.25,000 గుణిజాలలో ఎంతమొత్తానికైనా పాలసీ తీసుకోవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు.
కాలపరిమితి: 15, 20, 25 సంవత్సరాల కాలపరిమితులతో పాలసీ అందుబాటులో ఉంటుంది. 15 ఏండ్ల పాలసీకి ప్రీమియంను 11 సంవత్సరాలు చెల్లించాల్సి ఉండగా, 20 ఏండ్లకు 16 సంవత్సరాలు, 25 ఏండ్లకు 21 సంవత్సరాలు చెల్లించాలి.ప్రీమియంను నెలవారీ, త్రైమాసికం, అర్థ సంవత్సరం, వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు. వయస్సు:15 ఏండ్ల పాలసీకి 5 ఏండ్ల నుంచి 55 ఏండ్ల వయస్సు గలవారు ఈ పాలసీకి అర్హులు. 20, 25 ఏండ్ల పాలసీలకు గరిష్ఠ వయస్సు 50, 45 ఏండ్లు.