న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అథారిటీ రూ.36,844 జరిమానా వేసింది. ఈ మేరకు శ్రీనగర్ స్టేట్ ట్యాక్సెస్ ఆఫీసర్ నుంచి సోమవారం నోటీసులు వచ్చినట్టు బుధవారం స్టాక్ ఎక్సేంజ్‌లకు ఎల్ఐసీ తెలియజేసింది. కాగా, జమ్ము-కశ్మీర్లో 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఆయా ఇన్వాయిస్లపై 18 శాతానికి బదులుగా 12 శాతం చొప్పునే ఎల్ఐసీ పన్నులు చెల్లించినట్టు సదరు నోటీస్‌లో ఉన్నది.
దీంతో ఇంకా జీఎస్టీ రూ.10,462 రావాలని జీఎస్టీ అథారిటీ స్పష్టం చేసింది. అంతేగాక ఈ తప్పిదానికి సంబంధించి రూ.20, 000 జరిమానా వేసింది. దీనిపై గడిచిన మూడున్నరేండ్ల కాలానికిగాను రూ.6,382 వడ్డీని కూడా చెల్లించాలన్నది. ఇలా మొత్తంగా రూ.36,844 డిమాండ్ నోటీస్‌ను ఎల్ఐసీకి జీఎస్టీ అథారిటీ అందజేసింది.