LIC to Medclaim | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తిరిగి మెడిక్లయిమ్ సేవలందించడానికి ఆసక్తిగా ఉన్నదని ఆ సంస్థ చైర్మన్ ఎమ్మార్ కుమార్ పేర్కొన్నారు. దీనిపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) నుంచి క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అందరికీ వచ్చే ఎనిమిదేండ్లలో ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించేందుకు జీవిత బీమా సంస్థలు ఆరోగ్య బీమా రంగంలోకి రావాలని ఇటీవల ఐఆర్డీఏఐ చైర్మన్ దేవశీష్ పాండా సూచించారు. అయితే, ఆరోగ్య బీమాలోకి జీవిత బీమా సంస్థలను అనుమతించేందుకు అనుసరించాల్సిన విధి విధానాలను రూపొందిస్తున్నట్లు దేవశీష్ పాండా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీలపై ఎల్ఐసీ చైర్మన్ ఎమ్మార్ కుమార్ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే తమ సంస్థ దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణ అండ్ గ్యారంటీ బీమా పథకాలు ఆఫర్ చేస్తున్నదని ఎమ్మార్కుమార్ పీటీఐకి చెప్పారు.
దేశంలో బెస్ట్ సెల్లింగ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్లంటే.. మెడిక్లయిమ్ పాలసీలే. అయితే, నష్ట పరిహారం ఆధారిత ఆరోగ్య బీమా పథకాలను మార్కెట్ నుంచి ఉపసంహరించాలని 2016లో జీవిత బీమా సంస్థలను ఐఆర్డీఏఐ కోరింది. నాటి నుంచి జీవిత బీమా సంస్థలు స్థిర ప్రయోజనం కలిగించే ఆరోగ్య బీమా పాలసీలనే విక్రయిస్తున్నాయి. నష్ట పరిహార ఆధారిత ఆరోగ్య బీమా ప్లాన్లలో జీవిత బీమా సంస్థలు.. బీమా హామీ మొత్తం మేరకు వైద్య చికిత్స కోసం ఖర్చు చేసిన మొత్తం జీవిత బీమా సంస్థ రీయింబర్స్మెంట్ చేస్తుంది.
ప్రపంచ మార్కెట్లలో జీవిత బీమా సంస్థలు ఆరోగ్య బీమా పాలసీలనే విక్రయిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం 24.50 లక్షల జీవిత బీమా ఏజెంట్లు ఉంటే.. హెల్త్ ఇన్సూరెన్స్ క్యాటగిరీలో 3.60 లక్షల మంది ఏజంట్లు మాత్రమే ఉన్నారు. ఆరోగ్య బీమా రంగంలోకి జీవిత బీమా సంస్థలను అనుమతిస్తే.. ఆరోగ్య బీమా ఏజెంట్ల సంఖ్య 600 శాతం పెరుగుతుంది.