Lemon Price | ఇప్పుడు సూర్య భగవానుడు భగభగమని మండిపోతున్నాడు. మధ్యాహ్నం రోడ్లపైకి రావాలంటే ప్రజలు ఆలోచించుకోవాల్సిందే. వివిధ ఆఫీసులకు ఉద్యోగాలకు వెళ్లేవారు.. మార్కెటింగ్ పనిచేసేవారు.. నిత్యం రోడ్లపైనే ప్రయాణించాలి. భానుడి ప్రతాపంతో వడదెబ్బకు గురవుతారు. నీరసించిపోతారు. అలా కాకుండా ఉండాలంటే నిమ్మరసంతో కూడిన షర్బత్ తీసుకుంటే సరి. కాసింత రిలీఫ్ లభిస్తుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి. గత వారం రోజులుగా భాగ్యనగరంలో ఒక నిమ్మకాయ అక్షరాల రూ.10. ధర భారీగా పెరిగిన నిమ్మకాయలు కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపడం లేదని రిటైల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
నిమ్మకాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. గతంలో ఒక బస్తా నిమ్మకాయలు రూ.700లకు కొనే వాళ్లం. ఇప్పుడు రూ.3500 పలుకుతున్నది. దీంతో మేం ఒక్కో నిమ్మకాయను రూ.10లకు విక్రయించాల్సి వస్తున్నది. కానీ అంత ధర పెట్టి కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు రావడం లేదు. నిమ్మకాయ కొనకుండానే వెళ్లిపోతున్నారని వెంకటేశ్ అనే వీధి వ్యాపారి చెబుతున్నాడు.
మరో వ్యాపారి లక్ష్మి కూడా మొత్తం ఒక బస్తా నిమ్మకాయ రూ.3000 పెట్టి కొనాల్సి వస్తున్నది. దీని ప్రకారం ఒక డజన్ నిమ్మకాయలు రూ.120కి విక్రయిస్తామంటే ఎవరూ ముందుకు రావడం లేదు. పూర్తిగా పండని నిమ్మకాయల్ని రెండు రోజులకైనా అమ్మేయొచ్చు. కానీ పచ్చగా పండిన నిమ్మకాయలు వెంటనే అమ్మేయాలి. లేదంటే పాడవుతాయని ఆని చెబుతున్నారు.
నిమ్మకాయల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఓ కస్టమర్ చెప్పాడు. గతంలో ఒక డజన్ నిమ్మకాయలు రూ.20లకు కొనుగోలు చేసేవాడినని, ఇప్పుడు రూ.120 చెల్లించాల్సి వస్తుందని అన్నాడు. వేసవి సీజన్ వల్లే నిమ్మకాయల ధరలు పెరిగిపోయాయని వాపోయాడు.