న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఆఫీస్ స్పేస్‌కు పడిపోతున్న డిమాండ్.. దేశంలో వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు అద్దం పడుతున్నది. అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ సోమవారం భారతీయ ఆఫీస్ మార్కెట్‌పై ఓ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికిగాను వచ్చిన ఈ రిపోర్టులో హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాల లీజింగ్ 1 శాతం క్షీణించినట్టు తేలింది. అలాగే పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో మార్కెట్లోకి కొత్తగా అందుబాటులోకి వచ్చే ఆఫీస్ స్పేస్ సైతం గతంతో పోల్చితే 36 శాతం తగ్గుముఖం పట్టినట్టు వెస్టియన్ పేర్కొన్నది.
హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా నగరాల్లో ఈ జనవరి-మార్చిలో 21.53 మిలియన్ చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగినట్టు వెస్టియన్ వెల్లడించింది. అంతకుముందు త్రైమాసికం (2025 అక్టోబర్-డిసెంబర్)తో చూస్తే ఇది 1 శాతం తక్కువ. అలాగే మార్కెట్లోకి ఈ మార్చితో ముగిసిన 3 నెలల కాలంలో కొత్తగా 9.70 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మునుపటితో పోల్చితే 36 శాతం పతనమైంది. కాగా, ఏడాది ప్రాతిపదికన మాత్రం ఆఫీస్ స్పేస్ లీజింగ్ 20 శాతం, కొత్త సరఫరా 2 శాతం పెరిగినట్టు వెస్టియన్ పేర్కొన్నది. ఈ క్రమంలోనే ‘భారతీయ ఆఫీస్ మార్కెట్ ఇప్పటికీ బాగానే ఉన్నది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ సవాళ్ల ప్రభావం లేదు’ అని వెస్టియన్ సీఈవో శ్రీనివాస రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దాదాపు పదేండ్లపాటు హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయింది. అన్ని రంగాల వ్యాపార, పారిశ్రామిక వర్గాలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకొనేందుకు పోటీపడ్డారు. విస్తరణ దిశగా అడుగులు వేశారు. అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడు ఆ స్థాయిలో జోరు కనిపించడం లేదు. నిజానికి నాడు మార్కెట్లో ప్రతికూల పరిస్థితులున్నా.. వాటిని అధిగమించి అన్ని నగరాల్లోని అవకాశాలను హైదరాబాద్ అందిపుచ్చుకున్నది. కానీ నేడు ఆ రకమైన ఆకర్షణ, వాతావరణం ఇక్కడ లేదన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ, రియల్టీ వర్గాలతోపాటు సర్వత్రా వ్యక్తమవుతుండటం గమనార్హం. మొత్తానికి నిర్మాణ రంగంలో ఈ నిస్తేజం ఇలాగే కొనసాగితే.. అనుబంధ రంగాలూ కునారిల్లడం ఖాయమే అంటున్నారంతా.