Layoffs | ఇటీవల కాలంలో కంపెనీల్లో లే-ఆఫ్స్ పెరిగాయి. ఐటీ కంపెనీలతో పాటు వివిధ రంగాల్లోనే కనిపించిన ఈ లేఆఫ్స్ ఫార్మారంగాన్ని తాకాయి. హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ సైతం పలువురు ఉద్యోగులను ఇంటికి పంపబోతున్నది. కంపెనీ 25శాతం వరకు ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తున్నది. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఎక్కువగా వేతనాలు పొందుతున్న ఉద్యోగులను రాజీనామా చేయాలని కోరినట్లుగా సమాచారం. ప్రస్తుతం కంపెనీలో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 25శాతం మందిని తగ్గించాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కంపెనీ సీనియర్ లెవెల్ ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇందులో ఏటా రూ.కోటిపైగా వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే, ఆర్అండ్డీ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 50-55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులను సైతం స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలని కోరినట్లు తెలుస్తున్నది. దాదాపు 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఫార్మా దిగ్గజానికి మార్కెట్ క్యాప్ దాదాపు రూ.92వేలకోట్లుగా ఉన్నది. ఈ నెల ప్రారంభంలో ఆదాయపు పన్ను కమిషనర్ హైదరాబాద్ విభాగం నుంచి కంపెనీ రూ.2,395కోట్లకు సంబంధించి డిమాండ్ నోటీసు అందుకుంది. 2022లో కంపెనీ చేపట్టిన విలీన ప్రక్రియకు సంబంధించి ఎందుకు పన్ను వేయకూడదో చెప్పాలంటూ ఐటీ అధికారులు నోటీసులు పంపారు. అయితే, లే-ఆఫ్స్ వ్యవహారంపై డాక్టర్ రెడ్డీస్ ఇంత వరకు అధికారికంగా స్పందించలేదు.