Layoffs 2024 | ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ఏడాది కాలంగా గూగుల్ (Google) , మైక్రోసాఫ్ట్ (Microsoft), అమెజాన్ (Amazon), ట్విట్టర్ (Twitter), లింక్డిన్ (LinkedIn), మెటా (Meta) వంటి టెక్ దిగ్గజాలు (tech Companies) ఒకదాని తర్వాత ఒకటి సంస్థలోని ఉద్యోగులను తొలగించాయి. విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. 2023లో టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్‌లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగబడ్డాయి. ఇక కొత్త ఏడాది సైతం టెకీలపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది. 2024లో అడుగుపెట్టామో లేదో తొలి మాసంలోనే వేల సంఖ్యలో ఉద్యోగులు కొలువులను కోల్పోయారు.
గూగుల్, అమెజాన్, మెటా సహా పలు దిగ్గజ కంపెనీలు కొత్త ఏడాది ఆరంభంలో కొలువుల కోతకు తెగబడ్డాయి. ఈ ఏడాది లేఆఫ్స్ తప్పవనే విస్పష్ట సంకేతాలూ పంపాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు 32 వేల మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ (Layoffs.fyi) తాజాగా వెల్లడించింది. యూపీఎస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, మెటా, అసెంచర్ వంటి పెద్ద సంస్థలు కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే వేలాది మందిని తొలగించినట్లు పేర్కొంది.
లేఆఫ్స్.ఎఫ్‌వైఐ డేటా ప్రకారం.. జనవరి 2024లో టెక్ కంపెనీల్లో జరిగిన మొత్తం తొలగింపులో యూపీఎస్ 40 శాతం వాటాను కలిగి ఉంది. కేవలం నెల వ్యవధిలోనే 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇక గత నెల గూగుల్ సంస్థ 1,000 మంది ఉద్యోగులను తొలగించగా, పేపాల్ 2,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. జనవరి 2024లో ఉద్యోగాల కోతల సంఖ్యను అమెజాన్ వెల్లడించనప్పటికీ, ఆ సంఖ్య వేలల్లో ఉంటుందని అంచనా. యూట్యూబ్, టిక్‌టాక్, డిస్కార్డ్, ఈబే, పిక్సర్ వంటి ఇతర ప్రధాన సాంకేతిక సంస్థలు ఈ ఏడాది తొలి నెలలో సుమారు 5000 మంది ఉద్యోగులను తొలగించాయి.
పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఏఐ వంటి టెక్నాలజీలను ఉపయోగించుకోవడం వల్లే ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం అని స్పష్టమవుతోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) వినియోగిస్తుండటం వల్ల.. ఇందులో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానికే చాలా కంపెనీలు సుముఖత చూపుతున్నాయి. దీని వల్ల కొత్త నియామకాల సంఖ్య తగ్గడమే కాకుండా.. ఉన్న ఉద్యోగులను కూడా టెక్ పరిశ్రమలు ఇంటికి పంపిస్తున్నాయి.
గూగుల్
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ 2024 ఆరంభంలోనే పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. హార్డ్‌వేర్, ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్, అడ్వర్టైజింగ్ సహా పలు విభాగాల్లో 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. గూగుల్‌లో మరిన్ని లేఆఫ్స్ తప్పవని కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు పంపిన మెమోలో స్పష్టం చేశారు.
యూట్యూబ్
గూగుల్ లేఆఫ్స్ నేపధ్యంలో యూట్యూబ్ సైతం తమ ఆపరేషన్స్‌తో పాటు క్రియేటర్ మేనేజ్మెంట్ టీమ్స్ నుంచి 100 మంది ఉద్యోగులను తొలగించింది. అల్ఫాబెట్ గ్రూప్ పునర్వ్యవస్ధీకరణలో భాగంగా కొలువుల కోత చేపట్టినట్టు కంపెనీ వెల్లడించింది.
అమెజాన్
టెక్ దిగ్గజం అమెజాన్ సైతం ఈ ఏడాది జనవరిలో ఫ్రెష్ లేఆఫ్స్ ప్రకటించింది. ప్రైమ్ వీడియో, ఎంజీఎం స్టూడియో డివిజన్స్‌లో ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. తన కీలక ప్రాధాన్యతలపై దృష్టి సారించడంతో పాటు ఆపరేషన్స్ క్రమబద్ధీకరణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను కుదించినట్టు పేర్కొంది.
మెటా
ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాం మాతృసంస్ధ మెటా ఈ ఏడాది ఆరంభంలోనే లేఆఫ్స్ ప్రకటించింది. టెక్నికల్ ప్రోగ్రాం మేనేజర్ విభాగంలో 60 మంది ఉద్యోగులపై మెటా వేటు వేసింది. కంపెనీ పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
డిస్కార్డ్
ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం డిస్కార్డ్ ఏడాది ఆరంభంలో లేఆఫ్స్‌కు తెగబడింది. కంపెనీ ఉద్యోగుల్లో 17 శాతం మంది ఉద్యోగులు 170 మందిని తొలగిస్తున్నామని డిస్కార్డ్ ప్రకటించింది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే క్రమంలో సంక్లిష్ట నిర్ణయం తీసుకున్నామని డిస్కార్డ్ సీఈవో జాసన్ సిట్రన్ చెప్పారు.
ట్విచ్
ఇక టెక్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ట్విచ్ సైతం లేఆఫ్స్ ప్రకటించింది. ఉద్యోగుల్లో 35 శాతం మందిని తప్పించనున్నట్టు వెల్లడించింది.
పేపాల్..
ఫైనాన్షియల్ టెక్నాలజీ దిగ్గజం పేపాల్ (PayPal) ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు జనవరి చివర్లో ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో సుమారు 2,500 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ మేరకు ఉద్యోగులకు కంపెనీ సీఈవో అలెక్స్ క్రిస్ (Alex Chriss) లేఖ రాశారు. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఈ వారాంతంలో సమాచారం అందజేస్తామని లేఖలో వెల్లడించారు. కంపెనీలో డూప్లికేషన్ తగ్గించడం, వనరులను సమర్థంగా వినియోగించడం, ఆటోమేషన్ వినియోగంతో సంక్లిష్టతలు తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభివృద్ధికి అవకాశం ఉన్న విభాగాల్లో తమ పెట్టుబడులు కొనసాగిస్తామని ఈ సందర్భంగా క్రిస్ పేర్కొన్నారు.
ఇవేకాదు.. ఇంకా చాలా సంస్థలు ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా ఇంటికి సాగనంపుతున్నాయి. కంపెనీ పునర్వ్యవస్ధీకరణ, వ్యయ నియంత్రణ చర్యలు, ఆర్థిక మందగమనం పేరుతో వందలాది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నాయి. దీంతో టెకీల్లో లేఆఫ్స్ గుబులు మొదలైంది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోనన్న భయం మొదలైంది. ఏడాది ఆరంభంలోనే పలు విభాగాల్లో ఆయా కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో మాస్ లేఆఫ్స్‌కు ఈ ట్రెండ్ సంకేతమని టెకీల్లో గుబులు రేగుతోంది.
Also Read..
Airtel | వినియోగదారులకు ఎయిర్టెల్ షాక్.. భారీగా పెరగనున్న టారిఫ్‌లు!
Varun Kumar | లైంగిక ఆరోపణలు.. భారత హాకీ ప్లేయర్‌పై కేసు నమోదు
King Charles | కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలి : ప్రధాని మోదీ