Layoff | ఫ్రెంచ్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ (Renault) భారీగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. దాదాపు 3వేల వరకు ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. హ్యూమన్ రీసోర్స్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి సపోర్టింగ్ సర్వీసెస్‌లో సుమారు 15శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తున్నది. లేఆఫ్స్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నిర్దిష్ట సంఖ్య చెప్పలేమని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, కార్యకలాపాలను సరళీకృతం చేయడం, వేగవంతం చేయడం, ఖర్చులను నియంత్రించడానికి ఉన్న మార్గాలను పరిశీలిస్తున్నట్లు రెనాల్ట్ పేర్కొంది. పలు నివేదికల ప్రకారం.. రెనాల్ట్ ప్రధానంగా యూఎస్ మార్కెట్లో కార్లను విక్రయించకపోవడం ద్వారా ట్రంప్ సుంకాల బారి నుంచి బయటపడింది. కానీ, దాని ప్రభావం పరోక్షంగా కంపెనీపై పడనున్నది. యూరోపియన్ ప్రత్యర్థులపై యూఎస్ వాణిజ్య అడ్డంకుల ఒత్తిడి రెనాల్ట్ తన దేశీయ మార్కెట్లో విక్రయించే ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. ఫ్రెంచ్ కంపెనీపై ఒత్తిడిని పెంచింది.
రెనాల్ట్ చైనా కంపెనీల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. రెనాల్ట్ తన కార్లలో 70శాతం కంటే ఎక్కువ యూరప్‌లో విక్రయిస్తుంది. అయితే, విక్రయాల వేగం నెమ్మదించింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి విస్తరించడం చాలా అవసరమని కంపెనీ భావిస్తుంది. ఈ మేరకు 2027 నాటికి యూరోపియన్ యేతర మార్కెట్లలో ఎనిమిది కొత్త మోడళ్లను విడుదల చేయడానికి మూడు బిలియన్ యూరోలు (సుమారు 3.4 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు రెనాల్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రణాళిక భారతదేశంతో సహా ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి పెట్టనున్నది. స్థానిక డిజైన్, తయారీ సామర్థ్యాలను పెంచేందుకు ఒక కొత్త డిజైన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నది. ఇది కేవలం ఉత్పత్తికే కాకుండా, డిజైన్‌కు మాత్రమే పరిమితం కాకుండా భారతదేశం కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో రెనాల్ట్ ఈవీ, హైబ్రిడ్ వాహనాలను సైతం అభివృద్ధి చేయాలని యోచిస్తోంది.