హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్.. జినోమ్ వ్యాలీలో నూతన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్ అండ్ డీ) ప్రారంభించింది. షామిర్‌పేట్‌లోని ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌లో రూ.250 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌తో 800 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా లారస్ ల్యాబ్స్ ఫౌండర్, సీఈవో సత్యనారాయణ చావా మాట్లాడుతూ..ఈ నూతన ఆర్అండ్డీ సెంటర్‌ను కలుపుకొని మొత్తంగా ఐదు పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అయిందని, ఈ సెంటర్‌తో మరిన్ని ఔషధాలపై దృష్టి సారించడానికి వీలుపడనున్నదన్నారు. వచ్చే నాలుగేండ్లలో రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు.
3జీవీ ఎక్సలెన్స్ సెంటర్ ప్రారంభం
3జీవీ జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌సీ-ఎడ్జ్ అడ్వాన్స్డ్ సర్టిఫైడ్ సైన్సెస్ సెంటర్‌ను శ్రీధర్ బాబు ప్రారంభించారు. 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ కోసం సంస్థ రూ.105 కోట్ల నిధులు వెచ్చించింది.