Gold Bonds | బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. దాదాపు రూ.1300 తక్కువకే తులం (24 క్యారట్లు) బంగారం కొనుక్కునే వెసులుబాటు కల్పిస్తోంది. శ్రావణ మాసం పెండ్లిండ్లతోపాటు త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో బంగారం ఇప్పుడు పెట్టుబడి ఆప్షన్ కూడా.. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ గోల్డ్ రూపంలో బాండ్లు.. సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) జారీ చేస్తోంది.
బంగారం బాండ్లపై పెట్టుబడులు పెట్టే వారు సోమవారం (2023 సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు) నుంచి శుక్రవారం వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక గ్రామ్ విలువ గల బంగారం బాండ్ విలువ రూ.5923గా లెక్క గట్టింది. కానీ, ఆన్ లైన్లో బాండ్ కొంటే రూ.50 రాయితీతో రూ.5873లకు గ్రామ్ బంగారం బాండ్ లభిస్తుంది పది గ్రాముల విలువ గల బంగారం బాండ్ కొంటే రూ.58,730. కానీ, ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల (తులం) బంగారం రూ.60,050. అంటే బులియన్ మార్కెట్లో కంటే రూ.1320 తక్కువకే బంగారం సొంతం చేసుకోవచ్చు.
బంగారం బాండ్ విలువ లెక్క గట్టడానికి ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ధరలను స్టాండర్డ్‌గా ఆర్బీఐ తీసుకుంటుంది. బాండ్ల జారీకి ముందు వారంలో చివరి మూడు రోజుల 99.9 స్వచ్ఛత గల బంగారం ధర ఆధారంగా ఆయా బాండ్ల విలువ ఖరారు చేస్తారు.
బంగారం బాండ్లకు ఎనిమిదేండ్ల మెచ్యూరిటీ ఉంటుంది. అయినా ఐదేండ్లకు వాటిని విక్రయించవచ్చు గానీ, దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను కింద 20 శాతానికి పైగా పన్ను వసూలు చేస్తారు. ప్రతి ఏటా ఈ బాండ్లపై 2.5 శాతం రిటర్న్స్ ఉంటాయి. సావరిన్ గోల్డ్ బాండ్ల స్కీమ్ తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇన్వెస్టర్లకు 120 శాతం రిటర్న్స్ లభించాయి.