Lithium | పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్లు, రైళ్లు, విద్యుత్తు, ప్రభుత్వరంగ సంస్థలు, బొగ్గు గనులు ఇలా అన్నింటినీ ప్రైవేటుకు దోచిపెట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. చివరకు కశ్మీర్లో ఇటీవల బయటపడిన లిథియం నిధిని కూడా వదలట్లేదు. అంతర్జాతీయ విపణిలో రూ. 35 లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేస్తున్న ఈ లిథియం గనులను వేలంలో ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 500 పీపీఎం నాణ్యత ఉన్న 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు గుర్తించినట్టు గత నెలలో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇంత భారీ స్థాయిలో నిల్వలు బయటపడటం ఇదే మొదటిసారి. విద్యుత్తు వాహనాల్లో ప్రధానంగా వాడే బ్యాటరీల తయారీలో ఈ లిథియం అయాన్లే ప్రధానం. తాజాగా గుర్తించిన నిల్వలతో లిథియం అయాన్లను విరివిగా వాడే మొబైల్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు అత్యంత చౌకగా లభిస్తాయని అందరూ భావిస్తున్నారు. దీంతో కశ్మీర్లో గుర్తించిన గనులను అందరూ బంగారంతో పోలుస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం సంచలన ప్రకటన చేసింది. కశ్మీర్‌లోని 59 లక్షల టన్నుల లిథియం నిల్వలను వేలం వేయనున్నట్టు తెలిపింది. జమ్ముకశ్మీర్ యూటీ యంత్రాంగం నేతృత్వంలో కాంపోజిట్ లైసెన్స్ (సీఎల్) జారీ చేయనున్నట్టు వెల్లడించింది. వేలంలో ఎక్కువ కోట్ చేసిన కంపెనీకి వెలికితీత కాంట్రాక్ట్ అప్పగించనున్నట్టు వివరించింది. ఈ మేరకు సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు గనుల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషీ సోమవారం పార్లమెంట్‌కు తెలియజేశారు.
కశ్మీర్లో లిథియం నిల్వలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి కేంద్రం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ గత నెలలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌లోని లిథియం గనులను వేలం వేయనున్నట్టు, దీని కోసం ప్రైవేట్ కంపెనీలను టెండర్లకు పిలువనున్నట్టు తెలిపారు. లిథియం వెలికితీత, ప్రాసెసింగ్ ప్రక్రియను బిడ్డింగ్‌లో గెలిచే ప్రైవేట్ కంపెనీకే కాంట్రాక్ట్ అప్పగించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను జమ్ముకశ్మీర్ యంత్రాంగం (జమ్ముకశ్మీర్ యూటీ కాబట్టి అక్కడ పరిపాలన కేంద్రం పరిధిలో ఉంటుంది) చూసుకొంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, లిథియం వెలికితీతకు అవసరమైన వనరులు పీఎస్‌యూల దగ్గర లేవని పేర్కొన్నారు.
లిథియం వెలికితీత, ప్రాసెసింగ్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు నేషనల్ అల్యూమీనియం కంపెనీ, హిందుస్థాన్ కాపర్, మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్‌కు దశాబ్దాలకు పైబడి అనుభవం ఉన్నది. ఈ మూడు సంస్థలు కబిల్ కన్సార్టియంగా ఏర్పడి లిథియం ప్రాసెసింగ్‌లో పరిశోధనలు కూడా చేస్తున్నాయి. అయితే, ఈ ప్రభుత్వరంగ సంస్థలను కాదని ప్రైవేట్ కంపెనీలను టెండర్లకు పిలవాలని కేంద్రం నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్లకు జాతి సంపదను దోచిపెట్టేందుకే బీజేపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పలువురు మండిపడుతున్నారు.