హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన టీజీ ఐ-పాస్ (తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం), టీ-ప్రైడ్ (తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఇంటర్ప్రెన్యూర్స్), టీ-ఐడియా (తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్) విధానాలతో అద్భుత ఫలితాలు వచ్చాయి. టీజీ ఐ-పాస్ వల్ల రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.28 వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. తద్వారా సుమారు 85 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. టీ-ప్రైడ్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, వికలాంగ వర్గాలకు రూ.402 కోట్ల ప్రోత్సాహకాలను అందించారు.
2023-24 ఆర్థిక సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన స్నేహపూర్వక విధానాలతో తెలంగాణకు పారిశ్రామిక రంగంలో మంచి గుర్తింపు లభించింది. గత ఏడాది కాలంలో 2,677 యూనిట్లకు అనుమతులు జారీచేయగా.. వాటిలో ఇప్పటికే 1,348 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. తద్వారా 32,502 మంది ఉపాధి పొందుతున్నారు. జనరల్ క్యాటగిరీ అభ్యర్థులకు సంబంధించిన టీ-ఐడియా స్కీమ్ ద్వారా 2,239 యూనిట్లకు రూ.345.98 కోట్లు మంజూరు చేశారు. ఈ స్కీమ్ కింద యూనిట్లు స్థాపించేవారికి పెట్టుబడి రాయితీలతోపాటు ల్యాండ్ కాస్ట్ రీయింబర్స్మెంట్, ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, పవర్కాస్ట్ రీయింబర్స్మెంట్, పావలా వడ్డీ తదితర ప్రోత్సాహకాలను ఇస్తున్నారు. టీ-ప్రైడ్ కింద ఎస్సీలు ఏర్పాటు చేసుకున్న 2,211 యూనిట్లకు రూ.121.72 కోట్లు, ఎస్టీలకు సంబంధించిన 4,800 యూనిట్లకు రూ.280.18 కోట్లు, వికలాంగులు ఏర్పాటు చేసుకున్న 196 యూనిట్లకు రూ. 13.43 కోట్ల సబ్సిడీలు అందజేశారు.
గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 3 మెగా ఇండస్ట్రీల నుంచి రూ.22,000 కోట్ల పెట్టుబడులు సాధించింది. వీటిలో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ రూ.9,000 కోట్లతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు, గోడీ ఇండియా రూ.8,000 కోట్లతో గిగా స్కేల్ సెల్స్తోపాటు లిథియం, సోడియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమలను ఏర్పాటు టేయనుండగా.. వెబ్ వర్క్స్ సంస్థ రూ.5,200 కోట్లతో డాటా సెంటర్లను ఏర్పా టు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. తద్వారా ఉద్యమ్ పోర్టల్లో నమోదైన పరిశ్రమల వివరాల ప్రకారం.. 2020 నుంచి 2024 వరకు 9,21,883 యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో తయారీ రంగానికి సంబంధించిన 1,90,669 యూనిట్లు, సేవల రంగానికి చెందిన 7,31,214 యూనిట్లు ఉన్నాయి.